పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్
ద్రోణ నిజామాబాద్, డిసెంబర్ 03
బోధన్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం స్థానిక శాసన సభ్యులు పి. సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బోదన్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 15 లక్షలతో నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. రూ. 66 లక్షలతో చేపట్టనున్న బోదన్ మండల ప్రజా పరిషత్ నూతన భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అన్ని హంగులతో ప్రభుత్వం నూతనంగా నిర్మించదల్చిన సమీకృత రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, వసతి గృహ సముదాయం కోసం బెల్లాల్ సమీపంలోని మధుమలంచా డిగ్రీ కళాశాల వద్ద స్థలాన్ని పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. బోధన్ లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డీసీహెచ్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, ఇతర వైద్యాధికారులతో సమావేశమై, వైద్యుల ఖాళీలు, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. ఖాళీగా ఉన్న డాక్టర్లు, స్టాఫ్ నర్సుల పోస్టులను వెంటనే భర్తీ అయ్యేలా చూడాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.
అభివృద్ధి పనులలో పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యా, వైద్య రంగాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే అన్ని విద్యా సంస్థలు ఒకే ప్రాంగణంలో ఉండేలా బెల్లాల్ మధుమలంచ డిగ్రీ కళాశాల వద్ద సుమారు 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కం హాస్టల్స్ భవన సముదాయం నిర్మించాలని సంకల్పించామన్నారు. అదేవిధంగా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీని మంజూరు చేయించామని, జిల్లా ఆసుపత్రిలో నూతన గదులు నిర్మించామని అన్నారు. ప్రజలకు సేవలు అందించే అధికారులకు కూడా సౌకర్యాలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతో బోధన్ ఎంపీడీఓ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. శిథిలావస్థకు చేరిన బోధన్ మున్సిపల్ కార్యాలయ భవనం స్థానంలో త్వరలోనే రూ. 4 కోట్ల వ్యయంతో నూతన భవన నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వివరించారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తోందని అన్నారు. రైతులకు 21వేల కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేశామని, వరి పంటకు మద్దతు ధరతో పాటు సన్నాలకు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తున్నామని తెలిపారు. రైతులు సన్నరకం ధాన్యం సాగుకు చొరవ చూపాలని కోరారు. ఎమ్మెల్యే వెంట బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూముపద్మావతి శరత్ రెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సంధ్య, పిసిసి డెలిగేట్ సభ్యులు గంగా శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, పాషా మొయినుద్దీన్, కల్దుర్కి కి రెండో అధ్యక్షులు, జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్ శరత్, సంజీవరెడ్డి, బోధన్ కమ్మ సంఘం అధ్యక్షులు శివన్నారాయణ, పులి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.