Wednesday, February 11, 2026

నిజామాబాద్ లో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

ద్రోణ,నిజామాబాద్, ఫిబ్రవరి 11

నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ప్రశాంతంగా కొనసాగింది. నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల పరిధిలో అన్ని చోట్ల పోలింగ్ మంగళవారం ఉదయం 7.00 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమయ్యింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు చేరుకోవడం ప్రారంభించారు. ఉదయం 9.00 గంటల సమయానికి సగటున 8.25 శాతం పోలింగ్ నమోదయ్యింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 6.49 శాతం, ఆర్మూర్ లో 11.05 శాతం, బోధన్ లో 14.24 శాతం, భీంగల్ లో 9.38 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఉదయం 11 గంటల సమయానికి సగటు పోలింగ్ 22.54 శాతం జరుగగా, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 18.94 శాతం, ఆర్మూర్ లో 29.60 శాతం, బోధన్ లో 32.35 శాతం, భీంగల్ లో 31.09 శాతం పోలింగ్ నమోదయ్యింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఓటింగ్ అనూహ్యంగా పుంజుకుంది. సగటున 39.68 శాతం ఓటింగ్ జరుగగా, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 35.49 శాతం, ఆర్మూర్ లో 47.93 శాతం, బోధన్ లో 50.69 శాతం, భీంగల్ లో 51.53 శాతం పోలింగ్ నమోదయ్యింది. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి సగటున 48.55 శాతం ఓటింగ్ జరుగగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 43.18 శాతం, ఆర్మూర్ లో 60.07 శాతం, బోధన్ లో 61.77 శాతం, భీంగల్ లో 63.65 శాతం పోలింగ్ నమోదయ్యింది.కాగా, జిల్లా ఎన్నికల అధికారి, ఇలా త్రిపాఠి నిజామాబాద్ నగరంలోని ఎస్.ఎఫ్.ఎస్ స్కూల్, అర్సపల్లి పాఠశాల, మాలపల్లిలోని బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలోని రాం మందిర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ హైస్కూల్, పెర్కిట్ లోని జిల్లా పరిషత్ బాలుర ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. హెల్ప్ డెస్క్ లు, మెడికల్ క్యాంపు, వీల్ చైర్ ఇతర అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా? అని తనిఖీ చేశారు. కలెక్టరేట్ నుండి కూడా ఆయా పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఓటింగ్ తీరును, స్థానిక పరిస్థితులను కలెక్టర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, అబ్జర్వర్ సీహెచ్.సత్యనారాయణ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. కలెక్టర్ నేతృత్వంలో నాలుగు మున్సిపాలిటీల పరిధిలోనూ ఓటింగ్ నిర్వహణ కోసం అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. జిల్లాలో మొత్తం 729 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, భారీగా ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఎక్కడికక్కడ ఓటింగ్ ఆవశ్యకతను వివరిస్తూ వివిధ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ఫొటోలతో కూడిన ఓటరు స్లిప్పులను పంపిణీ చేయడం, బీ.ఎల్.ఓలతో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి ఓటర్లకు వారి ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది అనే విషయాన్ని తెలియజేసేలా చర్యలు తీసుకోవడంతో ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటరు ఐ.డీ కార్డు లేని పక్షంలో ఎన్నికల సంఘం ధృవీకరించిన 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని చూపించి ఓటు వేయవచ్చని విస్తృత ప్రచారం చేయడం సత్ఫలితాలు ఇచ్చిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగిందని, ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయించామని, వెబ్ క్యాస్టింగ్ జరిపించామని, మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ తీరును నిశితంగా పరిశీలన చేశారని అన్నారు. నిర్ణీత సమయం లోపు క్యూ లైన్లలో నిలుచున్న వారికి కూడా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఓటు వేసే అవకాశం కల్పించామని అన్నారు. ఈ నెల 13న ఉదయం 8.00 గంటల నుండి కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపును చేపట్టి ఫలితాలను వెల్లడించేలా విస్తృత చర్యలు చేపట్టామన్నారు. కౌంటింగ్ సందర్భంగా ఏ చిన్న తప్పిదానికి సైతం తావులేకుండా జాగ్రత్తగా ఓట్ల లెక్కింపు జరపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కాగా, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి సైతం పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ ఓటింగ్ తీరుతెన్నులను పరిశీలన జరిపారు. ఓటింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి, పోలీసు బందోబస్తు మధ్యన స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular