Wednesday, August 12, 2026

కేజీబీవీ పాఠశాలలో స్వచ్ఛమైన తాగునీటి అందించాలి

నిజామాబాద్ ఆగస్టు 12 :ద్రోణ

ఎడపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ మైనార్టీ బాలికల విద్యాలయాన్ని, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్/జూనియర్ కళాశాలలను కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం సందర్శించారు.
పాఠశాలల పరిసరాలను, కిచెన్, స్టోర్ రూమ్, తరగతి గదులను పరిశీలించారు. కేజీబీవీ పరిసరాలు పిచ్చి మొక్కలతో నిండి అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్, వెంటనే పరిసరాలను శుభ్రం చేయించాలని, వర్షపు నీరు నిలువ ఉండకుండా చూడాలని అన్నారు. సువిశాలమైన ఖాళీ స్థలం అందుబాటులో ఉన్నందున అన్ని వసతులతోకూడిన క్రీడా మైదానంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేసి, మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని, పాఠశాలల ప్రవేశ మార్గంలో ప్రధాన ద్వారం వద్ద అందరికీ కనిపించేలా మెనూ బోర్డును ప్రదర్శించాలని నిర్వాహకులను ఆదేశించారు. కేజీబీవీ లో బాలికల సంఖ్య తక్కువగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్, ఇతర విద్యార్థినులకు ప్రవేశాలు కల్పించే విషయమై సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడతానని అన్నారు. పాఠశాలలో కొనసాగుతున్న ప్రహారీ గోడ నిర్మాణం పనుల నాణ్యతను పరిశీలించారు. ఆర్.ఓ వాటర్ ప్లాంట్ నిరుపయోగంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్, జిల్లా వ్యాప్తంగా గల అన్ని కేజీబీవీలలో ఆర్.ఓ ప్లాంట్లు, సోలార్ హీటర్లు వినియోగంలోకి తెచ్చేందుకు మరమ్మత్తులు చేయించాలని అధికారులను ఆదేశించారు. రెసిడెన్షియల్ కళాశాల ఆవరణలో వరి ధాన్యం, ఇతర కూరగాయలను సాగు చేస్తుండడాన్ని గమనించిన కలెక్టర్ నిర్వాహకులను అభినందించారు. బాలికల ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అనంతరం పదవ తరగతి క్లాస్ రూమ్ లను సందర్శించి, విద్యార్థినులకు ఆంగ్లం సబ్జెక్ట్ లో పాఠాలు బోధించారు. పలు ప్రశ్నలు వేస్తూ వారి అభ్యాసన సామర్థ్యాన్ని అంచనా వేశారు. తన వెంట తెచ్చిన బహుమతులను అందించారు. చక్కగా చదువుకోవాలని, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని విద్యార్థినులకు ప్రేరణ కల్పించారు.
కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ దత్తాత్రి, ఎంఈఓ గాలప్ప, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ దీపిక, రెసిడెన్షియల్ స్కూల్ సహాయ ప్రిన్సిపాల్ సురేఖ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular