Thursday, September 17, 2026

నాణ్యతతో సకాలంలో యంగ్ ఇండియా స్కూల్ పూర్తి చేయాలని ఆదేశం

కొడిచెర్ల ఇసుక క్వారీ సందర్శించిన కలెక్టర్

నిజామాబాద్, సెప్టెంబర్ 16 :ద్రోణ

అన్ని హంగులతో ప్రభుత్వం నూతనంగా నిర్మించదల్చిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, వసతి గృహ సముదాయాలను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. పోతంగల్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ స్కూల్ పనులను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. అకడమిక్, అడ్మిన్ బ్లాక్ లు, డార్మెటరీ, కిచెన్, డైనింగ్, ఇండోర్ గేమ్స్, క్రికెట్ గ్రౌండ్, ప్లే గ్రౌండ్, టీచర్స్ క్వార్టర్స్, సెక్యూరిటీ బ్లాక్, పార్కింగ్ తదితర నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల వివరాలు ఆరా తీశారు. మైల్ స్టోన్ ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అని గమనించారు. నిర్దేశిత సమయం లోపు పనులన్నీ పూర్తయ్యేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలని టీజీఈడబ్ల్యూఐడీసీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అధునాతన వసతి, సదుపాయాలతో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తోందని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులందరికీ ఒకే సముదాయంలో అన్ని అధునాతన సౌకర్యాలతో వసతిని కల్పిస్తూ, ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో అందరికీ ఆదర్శంగా నిలిచేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను అందుబాటులోకి తెస్తోందని అన్నారు. వీటి ప్రాధాన్యతను గుర్తెరిగి, పనుల నాణ్యతలో ఎక్కడ కూడా రాజీ పడకుండా పూర్తి స్థాయిలో నిబంధనలు పాటించాలని అన్నారు. ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ లో సుమారు 2500 మంది పైచిలుకు విద్యార్థులు, 300 మంది వరకు బోధన, బోధనేతర సిబ్బంది ఉంటారని, వీరి అవసరాలకు సరిపడా మంచినీరు, డ్రైనేజీ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు, నాణ్యతా లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణ పనులకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తేవాలని అన్నారు. అనంతరం కలెక్టర్ కొడిచెర్ల ఇసుక క్వారీని సందర్శించారు. క్వారీలో అందుబాటులో ఉన్న ఇసుక నిల్వలను పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం నిబంధనలను అనుసరిస్తూ ఈ క్వారీ ద్వారా ఇసుకను అందించాలని అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా గట్టి నిఘా ఉంచాలని, సీ.సీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరపాలని సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీఓ విజయ కుమారి, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular