బోధన్ సెప్టెంబర్ 10:ద్రోణ
నిజామాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. బి. రాజశ్రీ , డాక్టర్ విద్య ,CEA మరియు PCPNDT ప్రోగ్రామ్ అధికారులతో కలిసి బోధన్ పట్టణంలోని అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఈ సందర్భంగా PCPNDT Act, 1994 నిబంధనల అమలును పరిశీలిస్తూ, స్కానింగ్‌కు వచ్చిన గర్భిణీల వివరాలు, వారిని రిఫర్ చేసిన వైద్యులు/ఆసుపత్రుల వివరాలు, స్కానింగ్ నిర్వహించడానికి గల కారణాలు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. సంబంధిత రికార్డులు, రిజిస్టర్లు మరియు Form-F లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
జిల్లాలో లింగ నిష్పత్తి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో, స్కానింగ్ సమయంలో గర్భస్థ శిశువు ఆడ/మగ అనే విషయాన్ని తెలుసుకోవడం, అడగడం లేదా తెలియజేయడం పూర్తిగా నిషేధమని అధికారులు స్పష్టం చేశారు. PCPNDT చట్ట నిబంధనలను ప్రతి స్కానింగ్ కేంద్రం తప్పనిసరిగా పాటించాలని సూచించారు.అలాగే Form-Fను పూర్తి వివరాలతో, ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని గర్భిణీ చిరునామా, గతంలో జన్మించిన పిల్లల వివరాలు తదితర సమాచారాన్ని సక్రమంగా నమోదు చేయాలని అధికారులను హెచ్చరించారు. రికార్డుల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.
అర్హత కలిగిన వైద్యుల సరైన రిఫరల్ మేరకు మాత్రమే అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహించాలని PCPNDT Act నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి స్కానింగ్ చేయరాదని స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులకు సూచించారు.ఈ తనిఖీలలో భాగంగా బోధన్‌లోని శ్రీ కృష్ణ స్కానింగ్ సెంటర్ న్యూ లైఫ్ శ్రీ లక్ష్మి మెటర్నిటీ హాస్పిటల్ తదితర కేంద్రాలను అధికారులు తనిఖీ చేసి రికార్డులు, రిజిస్టర్లు మరియు PCPNDT నిబంధనల అమలును పరిశీలించారు.తనిఖీల సందర్భంగా గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దుకోవాలని సూచిస్తూ, అవసరమైన సందర్భాల్లో సంబంధిత కేంద్రాలకు నోటీసులు జారీ చేసి చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
PCPNDT చట్టం అమలులో అధికారులకు ప్రతి స్కానింగ్ కేంద్రం పూర్తి సహకారం అందించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టం తన పని తాను చేసుకుంటుందని** అధికారులు స్పష్టం చేశారు.


