Friday, September 4, 2026

గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి

పోలీసులకు ప్రజలందరూ సహకరించాలి కమిషనర్

నిజామాబాద్ సెప్టెంబర్ 3 ద్రోణ

గణేష్ చవితి పండుగ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని బోధన్ పట్టణంలో పోలీసు ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ సిటీ సాయి చైతన్య హాజరయ్యారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ , భద్రతా ఏర్పాట్లు , శాంతిభద్రతలు , ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై శాంతి కమిటీ సభ్యులు , గణేష్ ఉత్సవాల నిర్వాహకులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతమైన , సోదరభావంతో కూడిన శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. పండుగ అనేది ప్రజలందరినీ ఐక్యం చేసే కార్యక్రమమని , ప్రతి ఒక్కరూ పరస్పరం సహకరించుకుంటూ మత సామరస్యాన్ని కాపాడాలని కోరారు. గణేష్ మండపాల నిర్వాహకులు ముందస్తుగా పోలీసుల అనుమతులు తీసుకోవడంతో పాటు , పోలీస్ శాఖ సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ తెలిపారు. మండపాల వద్ద భద్రతా ప్రమాణాలు పాటిస్తూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లు , అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాల వద్దకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ , పార్కింగ్ , జనసందోహం నియంత్రణకు నిర్వాహకులు ప్రత్యేకంగా సహకరించాలని తెలిపారు. మండపాల వద్ద డీజేలు , సౌండ్ సిస్టమ్‌ల వినియోగంలో ప్రభుత్వం నిర్దేశించిన శబ్ద పరిమితులు , సమయ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా కూడా నిర్వాహకులు పోలీస్ శాఖతో సమన్వయం చేసుకొని ముందుగా నిర్ణయించిన మార్గాలు , సమయాలను పాటించాలని సూచించారు. నిమజ్జన ఊరేగింపులో పాల్గొనే వారు ఎలాంటి రెచ్చగొట్టే నినాదాలు , వివాదాస్పద చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు , వదంతులను నమ్మవద్దని , ఏదైనా అనుమానాస్పద సమాచారం లేదా సమస్య ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కమిషనర్ సూచించారు. ఉత్సవాల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని , గణేష్ ఉత్సవాలు మరియు నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా , సురక్షితంగా , విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని అవసరమైన భద్రతా చర్యలు చేపడుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా శాంతి కమిటీ సభ్యులు , గణేష్ మండపాల నిర్వాహకులు , ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించి మత సామరస్యాన్ని , శాంతిభద్రతలను కాపాడుతూ గణేష్ ఉత్సవాలను విజయవంతం చేయాలని పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఏ.సి.పి శ్రీనివాస్ , ఏ.సీ.పి ట్రాఫిక్ మస్తాన్ అలీ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి , బోధన్ ఎస్.హెచ్.ఓ వెంకటనారాయణ , బోధన్ రూరల్ సీఐ విజయబాబు , రుద్రూర్ సిఐ కృష్ణ , రిజర్వ్ ఇన్స్పెక్టర్ యాదగిరి , కోటగిరి ఎస్.ఐ శ్రీనివాస్ , రెంజల్ ఎస్ఐ గంగాధర్ , ఎడపల్లి ఎస్.ఐ ఎం రామ వర్ని ఎస్ఐ వంశీకృష్ణ రెడ్డి , కోటగిరి సర్పంచ్ బర్ల మధుకర్, యాద్గార్ పూర్ సర్పంచ్ గౌస్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాస్ , మున్సిపల్ కౌన్సిలర్లు , సర్పంచులు మరియు సార్వజని గణేష్ మండలి సభ్యులు , గణేష్ మండలి నిర్వాహకులు , ఆర్గనైజర్లు వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular