నిజామాబాద్, సెప్టెంబర్ 3 : ద్రోణ
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 5, 6, 12, 13 తేదీలలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. మొదటి విడతగా 5, 6 తేదీలలో, రెండవ విడతగా 12, 13వ తేదీలలో స్పెషల్ క్యాంపెయిన్ కొనసాగుతుందన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు సందర్భంగా ప్రతి బూత్ లెవల్ అధికారి (BLO) తమకు కేటాయించిన నిర్దేశిత ప్రదేశంలో అందుబాటులో ఉంటారని అన్నారు. ఓటర్లకు అవసరమైన ఫారం-6, ఫారం-7, ఫారం-8లతో పాటు ముసాయిదా ఓటరు జాబితాను అందుబాటులో ఉంచడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన వారు ఫారం-6 ద్వారా, ఓటరు జాబితాలోని పేర్ల తొలగింపు లేదా అభ్యంతరాలకు ఫారం-7 ద్వారా, ఓటరు వివరాల్లో మార్పులు, సవరణలు, చిరునామా మార్పు వంటి వాటికి ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.ప్రతి పోలింగ్ కేంద్రంలో సంబంధిత బూత్ లెవల్ అధికారులతో పాటు బూత్ లెవల్ ఏజెంట్లు కూడా అందుబాటులో ఉండాలని, ముసాయిదా ఓటరు జాబితాను ఓటర్లు పరిశీలించేందుకు సహకరించాలని సూచించారు.అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవడంతో పాటు, అవసరమైన సవరణలు, మార్పులు లేదా కొత్తగా ఓటరు నమోదు కోసం స్పెషల్ క్యాంపెయిన్ రోజుల్లో తమ సమీప పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనలో కలెక్టర్ కోరారు.
