ఆసుపత్రుల ప్రతినిధులతోసమీక్ష
చిన్నారుల ఆసుపత్రిలో భద్రత విషయంపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆసుపత్రి ప్రతినిధులకు అవగాహన కల్పించారు.ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న సంఘటనను దృష్టిలో ఉంచుకొని , నిజామాబాద్ జిల్లాలో చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ , ప్రైవేట్ ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలను సమీక్షించేందుకు ప్రత్యేక సమావేశం కామెంట్ కంట్రోల్ హాల్ లో ఏర్పాటు చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ప్రభుత్వ , ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు , వైద్యులు , సంబంధిత అధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో చిన్నారుల భద్రత , అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు , అగ్ని ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలు తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు.
ప్రత్యేకంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో అగ్నిమాపక పరికరాల అందుబాటు , వాటి పనితీరు , అత్యవసర నిష్క్రమణ మార్గాలు , ఫైర్ అలారం వ్యవస్థ , విద్యుత్ భద్రత , సిబ్బందికి ఫైర్ సేఫ్టీపై అవగాహన , అత్యవసర సమయంలో రోగులను సురక్షితంగా తరలించే విధానం తదితర అంశాలను పరిశీలించారు.
చిన్నారులు చికిత్స పొందుతున్న ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆసుపత్రుల యాజమాన్యాలు ముందస్తు భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ , ఫైర్ సర్వీసెస్, వైద్య సిబ్బంది సమన్వయంతో వేగంగా స్పందించే విధంగా అవసరమైన ఏర్పాట్లు , మాక్ డ్రిల్ నిర్వహించాలి అని సూచించారు.
ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని , లోపాలు గుర్తించినట్లయితే వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని సమావేశంలో సూచించారు.
చిన్నారులు , వారి తల్లిదండ్రులు మరియు ఆసుపత్రికి వచ్చే ప్ర కొనుగోలు లకు సురక్షితమైన వాతావరణం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా , ప్రభుత్వ , ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు పోలీస్ , వైద్య ఆరోగ్య శాఖ మరియు ఫైర్ సర్వీసెస్ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో అదనపు డీసీపీ అడ్మిన్ ఎన్ శుభం ప్రకాష్ , డిఎం అండ్ హెచ్ ఓ బి. రాజశ్రీ , జిల్లా ఫైర్ అధికారి టి. పరమేశ్వర్ , ఎన్.ఎస్.సి ప్రెసిడెంట్ డాక్టర్ కవిత రెడ్డి , డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస ప్రసాద్ , ఐ.ఎం.ఏ ప్రెసిడెంట్ డాక్టర్ విశాల్ , ఎలక్ట్రిసిటీ ఎస్.ఈ పి.వి రాజేశ్వర్ రావ్ , నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ , ట్రాఫిక్ , సిసిఆర్.బి , ఎ.సి.పి లు ప్రకాష్ ,వెంకటేశ్వర రెడ్డి , శ్రీనివాస్ , మస్తాన్ అలీ ,గురు నాయుడు , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ రెడ్డి , మల్లేశం మరియు జిల్లాలోని చిన్నపిల్లల సంబంధించిన డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.



