కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి
ద్రోణ,నిజామాబాద్, ఫిబ్రవరి 12
నిజామాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో రిటర్నింగ్ అధికారులకు, కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయ సూపర్వైజర్లకు శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను కలెక్టర్ సందర్శించి, ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాల్సిన విధానం గురించి కీలక సూచనలు చేశారు. అదేవిధంగా బోధన్ లోని విజయ మేరీ హైస్కూల్ లో కౌంటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను, కౌంటింగ్ హాల్స్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను సైతం కలెక్టర్ సందర్శించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ భావోద్వేగాలతో ముడిపడి ఉన్నందున ఎంతో జాగ్రత్తతో బాధ్యతాయుతంగా కౌంటింగ్ విధులు నిర్వహించాలని కలెక్టర్ హితవు పలికారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను తు.చ తప్పక పాటిస్తూ, పూర్తి పారదర్శకంగా ఓట్ల లెక్కింపు జరపాలని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని, సొంత నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయకూడదని అన్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాల వెల్లడిలో గందరగోళానికి గురి కాకూడదని, ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా పరిశీలించుకుని వెల్లడించాలని సూచించారు. కౌంటింగ్ హాలు లోనికి ఆర్.ఓ మినహా ఇతరులు ఎవరికీ సెల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. సమయ పాలన పాటిస్తూ కౌంటింగ్ విధులకు సకాలంలో చేరుకోవాలని ఆదేశించారు.
కాగా, నిజామాబాద్ నగర పాలక సంస్థకు సంబంధించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో, బోధన్ మున్సిపాలిటీ ఓట్లను బోధన్ పట్టణంలోని విజయ మేరీ హైస్కూల్ లో, ఆర్మూర్ మున్సిపల్ ఓట్లను ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, భీంగల్ మున్సిపాలిటీకి సంబంధించిన కౌంటింగ్ ను భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.
శుక్రవారం ఉదయం స్ట్రాంగ్ రూమ్ ల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు చేరుస్తూ, 8.00 గంటల నుండి అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. నిర్ణీత సమయానికి కౌంటింగ్ ప్రారంభించేందుకు వీలుగా సిబ్బందిని అన్నివిధాలుగా సన్నద్ధం చేశామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఇప్పటికే పలు విడతలుగా శిక్షణ తరగతులు నిర్వహించి పూర్తి అవగాహన కల్పించామని అన్నారు.
ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద డివిజన్/వార్డు వివరాలను తెలిపేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశామని, ఎలాంటి పొరపాట్లు, గందరగోళానికి తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు.
అత్యధికంగా 60 డివిజన్లు కలిగిన నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని ఓట్ల లెక్కింపు కోసం పాలిటెక్నిక్ కళాశాలలో నాలుగు కౌంటింగ్ హాల్ లను ఏర్పాటు చేశామని వివరించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారని కలెక్టర్ తెలిపారు. ఒక్కో డివిజన్ కు ఒకటి చొప్పున 60 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశామని, ఏకకాలంలో అన్ని డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుందని అన్నారు. బ్యాలెట్ బాక్సులను తెరిచి, పోలైన ఓట్లను 25చొప్పున బండిల్స్ గా విభజిస్తూ, ఒక్కో రౌండ్ లో వెయ్యి చొప్పున ఓట్లను లెక్కించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలలో కూడా ఇదే తరహాలో ఒక్కో వార్డుకు ఒకటి చొప్పున కౌంటింగ్ టేబుల్ లు ఉంటాయని అన్నారు. ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ ను నియమించామని అన్నారు. ఆయా మున్సిపాలిటీల పరిధిలో పోల్ అయిన ఓట్లను రౌండ్ల వారీగా లెక్కించేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల అనుసారం అదనపు సిబ్బందిని సైతం రిజర్వ్ లో ఉంచామని అన్నారు. కాగా, అభ్యర్థులు, వారి తరఫున ఏజెంట్లు వారికి సూచించబడిన సమయం ఉదయం 7.00 గంటల లోపు కౌంటింగ్ సెంటర్ల వద్దకు రావాలని కలెక్టర్ సూచించారు. తాము జారీ చేసిన ఎంట్రీ పాసులతో పాటు ఏదైనా గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పాసు కలిగి ఉన్న వారినే కౌంటింగ్ సెంటర్ లోనికి అనుమతించడం జరుగుతుందన్నారు. అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా తుది ఏర్పాట్లను పూర్తి చేశామని, సిబ్బందికి అల్పాహారం, భోజనాలను కూడా ఓట్ల లెక్కింపు కేంద్రంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎలాంటి గందరగోళానికి తావులేకుండా పక్కాగా నిబంధనలను పాటిస్తూ, పూర్తి పారదర్శకంగా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని కలెక్టర్ కౌంటింగ్ సిబ్బందికి హితవు పలికారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద అవసరమైన పోలీస్ బందోబస్తు ఉంటుందని అన్నారు అన్నారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తదితరులు ఉన్నారు.










