ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
మామునూరు ఎయిర్పోర్ట్ పనులు త్వరితగతిన ప్రారంభించాలని కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య.
కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ని న్యూఢిల్లీలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మామునూరు ఎయిర్పోర్ట్ పనుల ప్రారంభం గురించి కేంద్ర మంత్రితో చర్చించారు. వరంగల్ మామూనూరు విమానాశ్రయం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని విమాన రాకపోకలు ప్రారంభించాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర మంత్రిని కోరారు. భవిష్యత్ అవసరాల కొరకు రెండేళ్లలో ఎయిర్ పోర్ట్ పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవలని కోరారు. రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత ప్రాధాన్యం ఉన్న వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4వేల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు. ఇప్పటికే కుడా మాస్టర్ ప్లాన్ కు ఆమోదం, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు భూములు ఇచ్చిన 863 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ఎయిర్ పోర్టు పునరుద్ధరణ కోసం 205 కోట్లతో భూసేకరణకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పౌర విమానయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రెండు సంవత్సరాలలో విమానాల రాకపోకలు ప్రారంభం అయ్యే విదంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.