తెలంగాణ ఎంపీల ప్రత్యేక సమావేశం
ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయం గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపడుతున్నారు. తెలంగాణ మణిహారం రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి (159 కి.మీ.) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి గడ్కరీతో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట్రానికి సంబంధించి పలు జాతీయ రహదారులు, ఇతర రహదారుల వివరాలను అందించి సత్వరం అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలంను హైదరాబాద్ తో అనుసంధానించే ఎన్.హెచ్-765లో 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉందని, మిగిలిన 62 కిలోమీటర్లు ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉందని, ఆ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని, అందుకు 2024-25 బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మధ్య 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య నగరాలైన హైదరాబాద్-విజయవాడ (ఎన్.హెచ్-65) రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనుల డీపీఆర్‌ను త్వరగా పూర్తి చేయాలని కోరారు. తెలంగాణలోని రెండో పెద్ద నగరమైన వరంగల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలన్నారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ను అనుసంధానించే ఎన్‌హెచ్-63 (16) వరంగల్, హన్మకొండ నగరాల మధ్యగా వెళుతోందని, ఈ రహదారిని నగరం వెలుపల నుంచి నాలుగు చోట్ల కలుపుతూ బైపాస్ మంజూరు.
చేయాలని కోరారు. పర్వత్ మాల ప్రాజెక్ట్ లో యాదాద్రి దేవాలయం, నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద రోప్ వే లను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ని కలిసిన వారిలో సీఎం గారితో పాటు పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ అనిల్ కుమార్ యాదవ్ , మల్లు రవి , పోరిక బలరాం నాయక్ , చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీ , రాయసాయం రఘురామిరెడ్డి, కడియం కావ్య , ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి ఉన్నారు.