Monday, December 23, 2024

నాగమడుగు, లెండి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

జుక్కల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని ఈ ప్రాంత రైతుల కష్టాలు త్వరలో తీర్చుతామని, నల్లమడుగు, లేండి ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు నిధుల విడుదల చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా యాసంగి పంటల సాగుకు భారీ నీటి పారుదల శాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తో కలిసి నీటిని దిగువకు విడుదల చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ
నియోజకవర్గంలో ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కేవలం 3,600 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుందని అన్నారు.
కాబట్టి నాగమడుగు,లెండి ప్రాజెక్టులు పూర్తి చేస్తే
జుక్కల్ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని మంత్రి కి విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా కౌలాస్ నాలా ప్రాజెక్టు నిర్మించిన నాటి నుండి నేటి వరకు నిర్వహణ లేదని,
కాలువలలో చెట్లు, ముళ్ల పొదలతో పూడిపోయాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
కాలువలలో పూడికలు తీసి మరమ్మతులు చేపట్టాలని మంత్రి ని కోరారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వందేళ్ల చరిత్ర గల నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని, వందేళ్ల పైబడిన నిజాంసాగర్ చెక్కు చెదరకుండా దృడంగా ఉందని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లు నీటి పారుదల రంగంలో భారీ అవినీతి అక్రమాలు చేసి నష్టం చేకూర్చిందని అన్నారు.
ప్రాజెక్టులపై 1.81 లక్షల కోట్లు ఖర్చు చేసి కొత్త ఆయకట్టుకు నీరు అందించలేదని విమర్శించారు.మాది రైతు పక్షపాతి ప్రభుత్వం అని, రైతులకు, వ్యవసాయానికి, నీటి పారుదల రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.కాళేశ్వరం నుండి ఒక్క నీటి బొట్టు ఉపయోగించకుండా 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి మన వరి రైతులు దేశంలోనే రికార్డు సృష్టించారని వివరించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని చెప్పారు.
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సన్నాలకు బోనస్ ఇచ్చామన్నారు.
అదేవిధంగా పంటల భీమాను పునః ప్రారంభిస్తామని, సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు.తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు అందించే విధంగా ప్రణాళికలతో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని అన్నారు.
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు విజ్ఞప్తి మేరకు నాగమడుగు ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని, లెండి ప్రాజెక్టు పనుల గురించి మహారాష్ట్ర ప్రభుత్వం మరియు అధికారులతో మాట్లాతానని,అవసరమైతే నేనే అక్కడికి వెళ్లి ప్రాజెక్టు పనులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.పార్లమెంట్ సమావేశాల అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో నీటి పారుదల రంగం, ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు,బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి , బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి ,రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు,జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్, బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి,
జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు,ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular