భూభారతకి శాసనసభ ఆమోదం
విదేశీ కంపెనీల చేతుల్లో మన రైతుల భూముల వివరాలు
ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
గత ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ధరణి పోర్టల్ కారణంగా అత్యంత రహస్యంగా ఉండాల్సిన తెలంగాణలోని రైతులకు సంబంధించిన భూ రికార్డులతో పాటు సమస్త సమాచారం దేశం ఎల్లలు దాటిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ ద్వారా 2020 నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి లావాదేవీకి సంబంధించి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నంబర్, టెలిఫోన్ నంబర్‌తో సహా అన్ని వివరాలు కళ్లకు కట్టినట్టుగా పరాయిల చేతుల్లోకి వెళ్లాయని చెప్పారు.
తెలంగాణ భూభారతి – (భూమిపై హక్కుల రికార్డు) చట్టం -2024 పై శాసనసభలో జరిగిన చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఆ చట్టం చేయడానికి తలెత్తిన పరిస్థితులను కూలంకుషంగా వివరించారు. గత ప్రభుత్వంలో భూ రికార్డుల కోసం తెచ్చిన ధరణి పోర్టల్ కారణంగా తలెత్తిన సమస్యలను సభకు తెలియజేశారు. ముఖ్యమంత్రి వెల్లడించిన వివరాలు.
ఈ భూభారతి కొత్త చట్టం ప్రవేశపెట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో యాజమాన్యపు హక్కులున్న ఒక కోటి 52 లక్షల ఎకరాల భూములకు సంబంధించిన వివరాలను భద్రపరచడమే కాకుండా అర్హులైన ప్రతి భూ యజమాని హక్కులను కాపాడటానికి చట్టాన్ని సమర్థవంతంగా సభలో ప్రవేశపెట్టి చర్చ పెట్టడం ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ ప్రభుత్వం ఒక సమర్థవంతమైన పూర్తి స్థాయి ఉపయోగపడే చట్టాన్ని తీసుకొచ్చిందని విశ్వాసం కల్పించాం.
ఆన్‌లైన్‌లో ఏదైనా నిర్వహిస్తే మనకు సంబంధించిన డేటా ఆ పోర్టల్ నిర్వహిస్తున్న వ్యక్తి కూడా తెలుసుకోలేనంత రహస్యంగా డేటా అంతా ఎన్‌క్రిప్ట్ అయి ఉండాలి. కానీ ధరణి పోర్టల్ కారణంగా రెవెన్యూకు సంబంధించిన సమస్త సమాచారం దేశ సరిహద్దులు దాటి ఇతర దేశాల్లో అందులోనూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న దేశాల్లో ఉన్న వారి చేతుల్లోకి వెళ్లింది.ఇది తీవ్రమైన నేరం. ప్రభుత్వంపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకుంటే ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసి, తెలంగాణ ప్రజలకు ద్రోహం, మోసం చేసి సంపూర్ణ సమాచారం క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న కంపెనీల చేతుల్లోకి బదిలీ అయింది.
ఈ వ్యవహారంలో ఏ రకమైన విచారణ చేయాలో తెలంగాణ సమాజం, ప్రతిపక్షాలు ఆలోచించాలి. మన దేశానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తున్న నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (NIC) వ్యవస్థ ఉన్నప్పటికీ, కాదని మన దేశానికి ఏమాత్రం సంబంధం లేని కంపెనీల చేతుల్లో సమస్త సమాచారం పెట్టారు.సమగ్ర భూ రికార్డుల నిర్వహణకు ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ – ధరణి ముందుగా TerraCIS, IL&FS అనే కంపెనీలకు అప్పగించినప్పటి అక్కడి నుంచి ఒక్కొక్కటిగా మారుతూ విదేశీ కంపెనీలకు చేతుల్లోకి మారింది. టెరాసిస్ అనే కంపెనీ నుంచి మొదలై ఐఎల్ఎఫ్ఎస్ అక్కడి నుంచి ఫిలిప్పీన్స్‌కు చెందిన Falcon SG కి ఎలా వెళ్లింది. తిరిగి అక్కడి నుంచి Falcon Investments కు ఎలా చేతులు మారింది.
ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ షేర్లు మారుతూ ఫాల్కన్ ఎస్జీ నుంచి స్పారో ఇన్వెస్ట్‌మెంట్స్, జీడబ్ల్యూ స్కై, హిల్ బ్రూక్స్ ఇన్వెస్ట్‌మెంట్స్, పారాడిగమ్ ఇన్నొవేషన్స్స్, క్వంటెలా ఇన్‌కార్పొరేషన్ ఇలా ఒకదాని నుంచి చేతులు మారాయి. ఈ కంపెనీలు టాక్స్ హెవెన్ దేశాలైన కేమన్ ఐల్యాండ్స్, బ్రిటిష్ ఐలాండ్స్ లాంటి దేశాల్లో ఉన్నాయి.
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి వ్యవహారాలను పరిశీలిస్తే ప్రభుత్వ భూములు, దేవాలయాల భూములు, భూదాన్ భూములు, లేదా ప్రైవేటు భూముల యజమానుల పేర్లు మార్చడం కావొచ్చు, జరిగిన దురాగతాలు, దుర్మార్గాలు అనేకం జరిగాయి.
పైగా కంపెనీతో జరిగిన ఒప్పందాలను సైతం ఉల్లంఘించారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే టాక్స్ హెవెన్ దేశాల్లో ఉంటే సంస్థలతో, ఇతర దేశాల్లో ఉండే కంపెనీల చేతుల్లోకి మారింది. తద్వారా సమస్త సమాచారం వారి చేతుల్లోకి వెళ్లింది.
ధరణి ఇంప్లిమెంట్ ఏజెన్సీగా ఉన్న ఫాల్కన్ ఇన్వెస్ట్‌మెంట్స్ లేదా టెరాసిస్ సంస్థ తరఫున గాదె శ్రీధర్ రాజు ప్రతినిధిగా ఉన్నాడు. ఇప్పుడు వాళ్లు అనుకుంటే కూర్చున్న చోటే మొత్తం సమాచారం తీసుకోవచ్చు.
భద్రంగా ఉండాల్సిన తెలంగాణ ప్రజల భూములకు సంబంధించిన మొత్తం సమాచారం ప్రభుత్వం వద్ద పెడితే ఆనాటి ప్రభుత్వం సంపూర్ణ సమాచారాన్ని ప్రైవేటు కంపెనీలు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో అందులోనూ ఈ దేశంలో లేని కంపెనీల చేతుల్లో పెట్టారు.
రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని వమ్ము చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన పాల్పడిన వ్యక్తుల చేతుల్లోకి సమాచారం వెళ్లింది. దీన్ని ఎలా సవరించి, ఎలా బాగుచేయాలని ప్రజా ప్రభుత్వం ఆలోచిస్తోంది.
చట్టం ప్రకారం దేశ పౌరుల వ్యక్తిగత సమాచారం ఏదైనా ఆ వ్యక్తి అనుమతి లేకుండా సేకరించడం చట్టరీత్యా నేరం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ఉండాల్సిన సమాచారం విశ్వసనీయత లేకుండా నిబంధనలు ఉల్లంఘించారు.
లక్షలాది మంది చేసుకున్న రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్లు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలు, టెలిఫోన్ నంబర్లు… ఇలా మొత్తం సమాచారం గాదె శ్రీధర్ రాజు చేతి ద్వారా రాహుల్ గోస్వామి నుంచి మొదలుపెడితే రకరకాల వ్యక్తుల చేతుల్లోకి ఇతర దేశాలకు చేరవేసిన ఆందోళనకర పరిస్థితి.
ఇలాంటి పరిస్థితులను పరిగణలోకి తీసుకునే తమ ప్రభుత్వం స్పష్టమైన ఒక విధానంతో ముందుకు వెళ్లాలని, ఎంతో మందితో సంప్రదింపులు జరిపి, కొన్ని వందల సార్లు సమావేశాలు నిర్వహించి రాత్రీపగలు చర్చించి భూ భారతి 2024 చట్టం రూపొందించాం.
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని ధరణిని దాదాపు నెల కిందట ఎన్ఐసీకి బదిలీ చేశాం. అలా బదిలీ చేసినప్పటికీ టెరాసిస్ అనే సంస్థ, గాదె శ్రీధర్ రాజు ఎన్ఐసీకి సహకరించడంలేదు. ప్రైవేటు వాళ్ల చేతుల్లో ఉన్న మొత్తం డేటా ఎన్ఐసీకి బదిలీ పూర్తయితే తప్ప దాన్ని నిర్వహించలేని పరిస్థితి.
ఈ మొత్తం వ్యవహారంలో కొంతకాలం మౌనంగా ఉండటానికి కారణమేమంటే… దీనిపై విచారణకు ఆదేశిస్తే ఎక్కడో బ్రిటిష్ ఐలాండ్‌లో ఒక్క క్లిక్ తో మన సమాచారం మొత్తం క్రాష్ అవుతుందన్న కారణంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నాం. భూ రికార్డులను తారుమారు చేయడానికి యువరాజు గారికి అత్యంత సన్నిహితులు రికార్డులను దేశ సరిహద్దులను దాటించారు.
ఈ మొత్తం వ్యవహారంలో తెరవెనుక బాగోతం బయటపడుతుందనే శాసనసభలో భూ భారతిపై చర్చ జరక్కుండా అడ్డుపడుతున్నారు. వందల ఎకరాల భూదాన్ భూములు చేతులు మారాయని కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి లాంటి వారు ఫిర్యాదు చేసినా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మార్చారు.
ఒక్క చోట కాదు. అనేక చోట్ల. అనేక ఘోరాలు, దారుణాలు జరిగాయి. ధరణి నిర్వహిస్తున్న వారికి ఎంత స్వేచ్ఛ ఉందంటే.. ఎక్కడైనా కూర్చొని, ఎప్పుడైనా.. ఏం కావాలన్నా పోర్టల్ భూ యజమానుల పేర్లను తారుమారు చేయొచ్చు. ధరణి నిజంగానే అద్భుతమే అయితే సభలో చర్చించే వాళ్లు.
అనేక సంక్లిష్టాలతో కూడుకున్నందున అవగాహన చేసుకోవడానికి కొంత సమయం తీసుకున్నాం. కొంచెం ఆలస్యమైనప్పటికీ ధరణి చట్టంతో ఇబ్బంది పడిన బాధల నుంచి విముక్తి కోసం ప్రజలు హర్షించే విధంగా వారి సూచనలకు అనుగుణంగా భూ భారతి చట్టం -2024 తెచ్చాం” అని ముఖ్యమంత్రి వివరించారు.