శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరిచిన
ముఖ్యమంత్రి
సంప్రదాయ పట్టు వస్త్రాలతో శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శన భాగ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పొందారు. వేద పండితులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. నీలం సంజీవరెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు మధ్యాహ్నం 2.10 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు.
స్థానిక రైతులతో కలిసి ప్రాజెక్టుపై నడుచుకుంటూ వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కి మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో ఆలయ వేద పండితులు ఆహ్వానం పలికారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఇరిగేషన్ శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను, రాయలసీమ ప్రాజెక్టుల స్కీమాటిక్ రేఖాచిత్రం మ్యాపును సీఎం తిలకించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను అధికారులు ముఖ్యమంత్రి కి వివరించారు.
అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
కృష్ణమ్మకు జల హారతులు ఇచ్చి, రైతుల హర్షద్వానాల మధ్య కృష్ణమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు.
అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు 6, 7, 8, 11 నెంబర్ల రేడియల్ గేట్లను తెరచి నీటిని దిగువకు వదిలారు. పరవళ్ళు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తున్న కృష్ణమ్మ నదిని చూసి ముఖ్యమంత్రి పులకరించి పోయారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితోపాటు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫారూఖ్, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జల వనరుల శాఖ సీఈ ఎస్.కబీర్ భాష, ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల ప్రతినిధులు, రైతులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


