జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క
బోధన్, ఆగస్టు 03 : విశాల తెలంగాణ
మహిళల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగాలని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ శిశు సంక్షేమం, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మహిళలకు పిలుపునిచ్చారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం విస్తృత స్థాయిలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు.
నిజామాబాద్ జిల్లా మోస్రా, చందూర్ మండల కేంద్రాలలో నూతనంగా నిర్మించిన సమీకృత మండల కార్యాలయాల భవన సముదాయాలకు జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదివారం ప్రారంభోత్సవాలు చేశారు. అదేవిధంగా మోస్రాలో జనరల్ ఫంక్షన్ హాల్, చందూర్ లో నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తదితరులతో కలిసి లబ్దిదారులకు రేషన్ కార్డుల మంజూరీ పత్రాలు, స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని బ్యాంకు లింకేజీ రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల శ్రేయస్సును కాంక్షించే ప్రభుత్వం అని అన్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించడమే కాకుండా, ప్రస్తుతం వారిని ఆర్టీసీ అద్దె బస్సులకు యజమానులు చేస్తోందని అన్నారు. పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, స్కూల్ యూనిఫామ్ ల స్టిచింగ్, సోలార్ విద్యుత్ ప్లాంట్ ల ఏర్పాటు వంటి వాటి ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాల ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తోందని తెలిపారు. మహిళలు లాభదాయకమైన వ్యాపారాలు నిర్వహించుకునేందుకు వీలుగా వడ్డీ లేని రుణాలను అందిస్తోందని, ఏడాదిన్నర కాలంలోనే మహిళా సంఘాలకు రూ. 26 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశామని మంత్రి వివరించారు. ఇందిరమ్మ ఇళ్లను కూడా మహిళల పేరిట మంజూరు చేస్తూ, వారికి భద్రత కల్పిస్తోందని అన్నారు. అంతేకాకుండా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రమాద బీమా, లోన్ బీమా వర్తింపజేస్తున్నామని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500 లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, రేషన్ కార్డులను కూడా మహిళల పేరుతోనే మంజూరు చేస్తున్నామని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలలో కూడా మహిళా సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు. పేదలు కడుపు నిండా భోజనం చేయాలనే సదాశయంతో తెలంగాణాలోని తమ ప్రభుత్వం దేశంలోనే మరెక్కడా లేనివిధంగా సన్న బియ్యం పంపిణీ చేస్తోందని తెలిపారు. 60 సంవత్సరాల వయస్సు దాటిన మహిళలకు ఇదివరకు స్వయం సహాయక సఘాలలో సభ్యత్వం ఉండేది కాదని, తాము అధికారంలోకి వచ్చాక వారికి కూడా సభ్యత్వాలు కల్పిస్తూ ఆర్ధిక ప్రయోజనాలు కల్పిస్తున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించుకునే వారికి లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను కూడా అందించేలా ఏర్పాట్లు చేశామని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మహిళలు అందరూ స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా చేరి, ఆర్ధిక అభ్యున్నతికి బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఇదివరకు కేవలం నాలుగు మండలాలతో కూడిన బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గంలో, పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా మరో ఆరు మండలాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గ కేంద్రమైన బాన్సువాడ మున్సిపాలిటీగా రూపాంతరం చెందిందని అన్నారు. కొత్త మండలాలలో సైతం అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్ధవంతంగా సేవలు అందించేలా ఒకే చోట అన్ని వసతులతో కూడిన మండల కార్యాలయాల సమీకృత భవన సముదాయాలను నిర్మించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు, రెండు పడక గదుల ఇండ్లు వంటి సంక్షేమ కార్యక్రమాలు విస్తృత స్థాయిలో అమలవుతున్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి నిధులు సిద్ధంగా ఉన్నాయని, లబ్దిదారులు నిర్మాణాలను వెంటనే చేపట్టి త్వరితగతిన పూర్తి చేసుకుంటే ప్రభుత్వం వారికి ఆయా దశలను అనుసరిస్తూ రూ. 5 లక్షల ఆర్ధిక సహాయం అందిస్తోందని, ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తిగా మాఫీ చేస్తోందని అన్నారు. ఈ అవకాశాన్ని లబ్దిదారులు వినియోగించుకోవాలని సూచించారు. కాగా, పోడు పట్టాలను ఇప్పటికే అర్హులను గుర్తించి పంపిణీ చేశామని, ఇంకనూ కొంతమంది అర్హులు మిగిలి ఉన్నందున వారికి కూడా పోడు పట్టాలు అందించేందుకు చొరవ చూపాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రిని కోరగా, మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమాలలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, డీపీఓ శ్రీనివాస్ రావు, నాయకులు భాస్కర్ రెడ్డి, రాము కర్లం, సాయి రెడ్డి పంచాయతీరాజ్ ఈ.ఈ శంకర్, సంబంధిత శాఖల అధికారులు, మార్కెట్ కమిటీలు, సహకార సంఘాల చైర్మన్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




















