ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిపై ఆరా తీసిన జిల్లా కలెక్టర్
నిజామాబాద్, ఆగస్టు 05 : ద్రోణ
గ్రామపంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో సదుపాయాలు కల్పనలో, పారిశుద్ధ్య విషయంలో ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విడుదల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహించే కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కరు ఇల్లు నిర్మించుకునే విధంగా చూడాలని, ఎవరైనా నిర్మాణానికి ముందుకు రాకపోతే వారితో రాతపూర్వకంగా రాయించుకుని రద్దు పరచి అర్హత కలిగిన కట్టుకునే వారికి కేటాయించేందుకు ఏర్పాటు చేస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. స్థానికంగా గల పల్లె దవాఖానాను, సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను సందర్శించారు. ముందుగా పల్లె దవాఖానాను కలెక్టర్ తనిఖీ చేసి, నిర్వహణ తీరును పరిశీలించారు. సిబ్బంది హాజరు, అవుట్ పేషంట్ల రిజిస్టర్లను తనిఖీ చేశారు. టీ.బీ ముక్త్ భారత్ అభియాన్ అమలుతో పాటు సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి ఆరా తీశారు. గ్రామంలో ఇతర ప్రాంతం నుండి వచ్చిన ఒకరికి డెంగ్యూ వచ్చిందని ఆరోగ్య కార్యకర్త శైలజ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో దోమల నియంత్రణ కోసం చేపడుతున్న చర్యల గురించి సమీక్షించిన సందర్భంగా, స్ప్రే, ఫాగింగ్ చేయించడం లేదని వెల్లడి కావడంతో గ్రామ కార్యదర్శి సురేష్ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన నెలన్నర రోజుల నుండి పదేపదే చెబుతున్నప్పటికీ, ఇంతవరకు స్ప్రే ఎందుకు చేయించలేదని నిలదీశారు. అక్కడినుండే జిల్లా పంచాయతీ అధికారికి ఫోన్ చేసి, అన్ని జీ.పీలలో పక్కాగా ఫాగింగ్ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కో గ్రామం వారీగా పరిశీలన జరిపించి, నివేదిక సమర్పించాలని సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా అన్ని నివాస ప్రదేశాలలో ఫాగింగ్ చేయించాలని, ఫ్రైడే – డ్రైడే పక్కాగా అమలయ్యేలా చూడాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ విషయంలో అలసత్వానికి తావు లేకుండా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరీలు పొందిన లబ్దిదారులు అందరూ ఇంటి నిర్మాణం చేపట్టేలా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ఆర్థిక స్థోమత లేని లబ్దిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా లక్ష రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని, రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ లబ్దిదారులకు ఇప్పటికే రూ. 30 కోట్ల పైచిలుకు రుణ సదుపాయం అందించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. ఇంకనూ అవసరం అయిన వారికి రుణ వసతి సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. ఐదు లక్షల ఆర్ధిక సహాయం అందిస్తుండగా, ఉచిత ఇసుకను సమకూరుస్తున్నామని గుర్తు చేశారు. అయినప్పటికీ లబ్దిదారులు ఎవరైనా ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రాకపోతే, అలాంటి వారి నుండి రాతపూర్వకంగా లేఖలు తీసుకుని లబ్దిదారుల జాబితా నుండి పేర్లను తొలగించాలని, వారి స్థానంలో అర్హత కలిగిన ఇతరులకు ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నూటికి నూరు శాతం ఇందిరమ్మ ఇళ్ళ పనులు ప్రారంభం అయ్యేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరుపుతూ, ఇంటి నిర్మాణం చేపట్టేలా లబ్దిదారులను ప్రోత్సహించాలని సూచించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్ళను అర్హులైన వారికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎంపీడీఓ ఆఫీసులో ప్రజాపాలన సేవా కేంద్రం కొనసాగుతున్న విషయం ప్రజలందరికి తెలిసేలా కార్యాలయం వద్ద ఫ్లెక్సిని ఏర్పాటు చేయించాలని సూచించారు. కాగా, ఎరువుల గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్, ఎరువుల నిల్వలను పరిశీలించారు. అక్కడికి వచ్చిన స్థానిక రైతులను పలుకరించి, ఎరువులు సరిపడా అందుతున్నాయా అని ఆరా తీశారు. ఎరువుల పంపిణీ సంతృప్తికరంగా ఉందని, తమ అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్నాయని రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ, జిల్లాలో ఎప్పుడు కూడా 11 వేల మెట్రిక్ టన్నుల వరకు ఎరువుల నిల్వలు మిగిలి ఉండగానే, కొత్తగా ఎరువుల స్టాక్ తెప్పించుకోవడం జరుగుతోందని అన్నారు. అన్ని ప్రాంతాలలో ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాలికాబద్దంగా చర్యలు తీసుకున్న ఫలితంగా ఎక్కడ కూడా కొరత ఏర్పడలేదని, రైతులు కూడా ఒకేసారి కాకుండా తమ అవసరాలకు అనుగుణంగా ఎరువులను తీసుకువెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఈ వానాకాలం సీజన్ పంటకు సంబంధించి ఇప్పటికే రెండు దఫాలుగా ఎరువుల వాడకం పూర్తయ్యిందని, చివరిదైన మూడవ దఫా వినియోగం సజావుగా సాగుతోందని గుర్తు చేశారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.




