ఢిల్లీలో జరగబోయే ధర్నా కార్యక్రమానికి కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోయే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రక్రియ పై ఢిల్లీలో ధర్నా కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల సమయంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని ఆ హామీని నిలబెట్టుకున్నందుకే కాంగ్రెస్ పార్టీ తమ వంతు ప్రయత్నాలు చేస్తుందని కోటగిరి తాజా మాజీ ఎంపీటీసీ కొట్ట మనోహర్ తెలిపారు. 42 శాతం రిజర్వేషన్లు ప్రక్రియ అమల్లోకి వస్తే బీసీ కులాలకు రాజకీయంగా, ఉద్యోగాలపరంగా ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రక్రియను తెలంగాణ కాంగ్రెస్ సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఈ స్థాయిలో బీసీలకు ఆదరించిన పరిస్థితులు ఏనాడూ లేవన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో సాహసోపేతమైన కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ఢిల్లీ వెళ్లిన వారిలో మాజీ జెడ్పిటిసి, ప్రస్తుత పొతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉప్పాల శంకర్, కాంగ్రెస్ నాయకులు బజరంగదత్తు, గిర్నిల రాజు ఉన్నారు.
