ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు
హైదరాబాద్ ఆగస్టు 8 ద్రోణ
పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో శుక్రవారం టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ ప్రముఖ అంతర్జాతీయ హృద్రోగ నిపుణుడు డా. హనుమాండ్ల రాజేందర్ రెడ్డి దంపతులు తమ 43వ పెండ్లి వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారి ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో వారి కుమారుడు రాజా రామ్మోహన్ రెడ్డి కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను రాజకీయ రంగప్రవేశం చేసిన రోజున ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చుతూ, పాలకుర్తి ఆలయ ప్రాంగణంలో గెస్ట్ హౌస్ (సత్రం) నిర్మాణానికి ఝాన్సీ దంపతులు భూమి పూజ నిర్వహించారు. ఈ గెస్ట్ హౌస్ నిర్మాణం పూర్తిగా తమ స్వంత నిధులతో చేపడతామని వారు వెల్లడించారు. భవిష్యత్తులో పాలకుర్తి ఆలయాన్ని దర్శించుకునే భక్తులకు విశ్రాంతి, వసతి కల్పించేందుకు సౌకర్యవంతమైన గెస్ట్ హౌస్ అవసరమని భావించి, ఈ నిర్మాణానికి ముందడుగు వేశామని వారు తెలిపారు.
భూమి పూజ అనంతరం మీడియాతో మాట్లాడిన హనుమాండ్ల ఝాన్సీ – డా. రాజేందర్ రెడ్డి దంపతులు, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు తమకు ఇచ్చిన గౌరవం, ప్రేమ, విశ్వాసం ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నారు. ఈ నేలకు మేము ఎంతో ఋణపడి ఉన్నామన్నారు. పాలకుర్తి ప్రజలకు ఎంత చేసినా అది తక్కువేనన్నారు. పాలకుర్తి అభివృద్ధి కోసం మేము ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేలా, మౌలిక సదుపాయాలు కలిగిన వసతి గృహం నిర్మాణం ద్వారా భక్తులు, యాత్రికులు ఇబ్బంది లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, మహిళ అధ్యక్షులు, యువజన అధ్యక్షులు, స్థానిక ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









