నాణ్యతలేని మట్టి రోడ్డు
నరకం చూస్తున్న ప్రయాణికులు
రెండేళ్లు గడుస్తున్న పురోగతి అదోగతి
డబల్ రోడ్డు అని ఆశ చూపారు
ఉన్నది పాయ ఉంచుకున్నది పాయ
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచి, పల్లె వాసుల బతుకుల్లో వెలుగులు చిమ్మేందుకు ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లను ఆధునికరిస్తున్నారు. సుంకిని బోధన్ రహదారిని సైతం ఆధుని కరణలో భాగంగా ఉన్న బీటీ రోడ్డును తవ్వేశారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లను తెగ నరికారు. బీటీ రోడ్డు స్థానంలో మొరం రోడ్డు వేశారు. శాసనసభ ఎన్నికల కన్నా ముందు ఈ రహదారికి మెరుగులు దిద్దుతామని ప్రభుత్వం నుండి కోట్లాది రూపాయలు నిధులు మంజూరయ్యాయని ఓ ప్రజాప్రతినిధి తనయుడు రహదారి పనులను దక్కించుకున్నారు. సింగల్ బిటి రోడ్డు స్థానంలో డబుల్ రోడ్డు నిర్మిస్తామని రెండేళ్ల క్రితం పనులను ప్రారంభించారు. శాసనసభ ఎన్నికల్లో అప్పటి కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల మనసులను దోచుకోలేకపోయింది. ఎన్నికల్లో పరాభవం ఎదురు కావడంతో ఆనాటి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ఆనాటి నుండి పనులు చేపట్టిన ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించడం లేదన్న అపవాదు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కొంతమేరకు పనులు చేపట్టిన గుత్తేదారు పనులు చేపట్టలేమని చేతులెత్తేశారు.
నరకం చూస్తున్న ప్రయాణికులు
సుంకిని నుండి బోధన్ రహదారి గతంలో బీటి రోడ్డు ఉండేది. బీటీ రోడ్డును తవ్వేశారు. మొరము రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. కొంతమేర నాణ్యత కోల్పోయిన మొరము వేయడంతో వర్షాలకు చిత్తడిగా మారింది. బోధన్ వెళ్లే ప్రయాణికులు నరకాన్ని చదివి చూస్తున్నారు. తారు రోడ్డు తవ్వేసి రెండేళ్లు గడుస్తున్న నేటి వరకు తిరిగి రహదారి పనులను పూర్తి చేయలేకపోయారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేసినప్పటికీ పనులు చేపట్టకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఈ రహదారి పనులను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉన్నది పాయ, ఉంచుకున్నది పాయ అన్న చందంగా రహదారి మారింది. వర్షాకాలంలో వర్షం పడిన ప్రతిరోజు రహదారి చిత్తడి మయంగా మారింది.
కొల్లూరు వద్ద అసంపూర్తిగా కల్వర్ట్ పనులు
ఇదే రహదారిలో వర్షాకాలం రహదారులపై నీరు ప్రవహిస్తూ ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతూ ఉండేవి. లో లెవెల్ వంతెన స్థానాల్లో హై లెవెల్ వంతెనలు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.పలుచోట్ల హై లెవెల్ వంతెనలు నిర్మించడంతో ప్రయాణికులకు కొంత మేరకు సౌకర్యం గా మారింది. కొల్లూరు సమీపంలో వాగు వద్ద ప్రతిసారి వర్షాకాలంలో రోడ్డుపై పెద్ద ఎత్తున నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని హై లెవెల్ వంతెన నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేశారు. అధికారులు టెండర్ ప్రక్రియను పూర్తి చేసి రెండేళ్లు దాటినప్పటికీ నేటి వరకు హై లెవెల్ వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయలేకపోయారు. వంతెన నిర్మాణ పనులు కొంతమేరకు చేపట్టి వచ్చేదారు చేతులెత్తేశారు. ప్రభుత్వం తమకు చేపట్టిన పనులకు బిల్లులు చెల్లింపు చేయడం లేదని తాము ఏమీ చేయలేని పరిస్థితుల్లో పనులు నిలిపివేశామని గుత్తే దారులు చేతులు ఎత్తేస్తున్నారు. భారీ వర్షాలు కురిసిన సందర్భాల్లో ఈ రహదారి రాకపోకలు నిలిచిపోతున్నాయి. రహదారి పనులు మరోపక్క వంతెన పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ఈ ప్రాంత ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు ఇటువంటి పనులను పూర్తి చేయించి ప్రజలకు మేలైన సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.











