Thursday, February 12, 2026

మంజీరా ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటాం

డిసిసిబి మాజీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి

వరద ప్రభావంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తాము అండగా ఉంటామని ప్రజలు ఆందోళన చెందవద్దని, అధికారులు ప్రతి నిమిషం పర్యవేక్షణ జరుపుతున్నారని, ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఎదురయితే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఉమ్మడి నిజాంబాద్ జిల్లా సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన బాన్సువాడ నియోజకవర్గం లోని, బీర్కూర్, పోతంగల్, సుంకిని గ్రామాలను వరద ప్రభావితమైన వ్యవసాయ భూములను పరిశీలించారు. వరద ప్రభావానికి ఇబ్బందులు కలిగే కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం అధికారులు చేస్తున్నారని స్పష్టం చేశారు. గతంలో మంజీరా వరద ప్రభావం ఏ మేరకు ఉండేదో సుంకిని గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మంజీరా ఉధృతికి భారీ స్థాయిలో పంట నష్టం జరిగే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆయన దృష్టి తీసుకువచ్చారు. వరద ఉధృతి తగ్గిన అనంతరం అధికారులు గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేస్తారని, పంట నష్టం అంచనాలను ప్రభుత్వానికి పంపించి రైతులకు నష్టపరిహారం అందించే ప్రయత్నం చేస్తామని పోచారం భాస్కర్ రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆయన వెంట తాసిల్దార్ గంగాధర్, ఎస్సై సునీల్, మాజీ జెడ్పిటిసిలు శంకర్ పటేల్, శంకర్, ఎజాజ్ ఖాన్, మాధవరావు పటేల్, హనుమంతరావు పటేల్, శివరాజ్ పటేల్, జుబేర్, చాకోరే గంగాధర్, రాంబాబు, శ్రీనివాస్, వెంకట్రావు పటేల్, రమేష్ సెట్, వర్ని శంకర్, సాయిలు, షాజీ తదితరులు పాల్గొన్నారు.

పొంగి పొర్లుతున్న మంజీరా

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, నిజాంసాగర్ నుండి వరద నీరు పెద్ద ఎత్తున మంజీరా నదికి విడుదల చేశారు. రెండు రోజుల నుండి అతి భారీ వర్షాలు కురవడం, మంజీరా నది ఉదృతంగా పొంగిపొర్లుతుంది. మంజీరా పరివాహక ప్రాంత వ్యవసాయ భూములు పెద్ద ఎత్తున నీట మునిగాయి. మరోపక్క బాన్సువాడ నియోజకవర్గం లోని కొన్ని గ్రామాలు మంజీరా ఉధృతికి నీట మునిగే అవకాశం ఉంది. గత పది ఏళ్ల నుండి కానీ విని ఎరగని రీతిలో మంజీరా పరవళ్ళు తొక్కుతూ గర్జిస్తోంది. తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరింత వర్షాలు ఉధృతమై మంజీరా మరింత పొంగిపొర్లి తాము వేసుకున్న పంటలు నష్టపోవడంతో పాటు గ్రామాల్లో నీరు వచ్చి చేరితే తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఊహించుకుంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగం ముందస్తుగానే అప్రమత్తమై ప్రజలను మేల్కొల్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular