బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న వరంగల్ ఎంపీ
హనుమకొండ సెప్టెంబర్ 21 ద్రోణ
హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో రెండు రోజులపాటు అలరించే కాకతీయ నృత్య నాటకోత్సవాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో కాకతీయ నృత్య నాటకోత్సవాలను ప్రముఖ నాట్య గురు, అకాడమీ అధ్యక్షురాలు ఆచార్య డాక్టర్ అలేఖ్య పుంజాల ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధ్యురాలు చాకలి ఐలమ్మ కూచిపూడి నృత్య రూపకం, ఓరుగల్లు చరిత్ర, కాకతీయ వైభవం గుర్తు చేస్తూ రాణి రుద్రమ చారిత్రక నాటకం, ప్రజా సాహిత్య కళారూపాల ప్రదర్శనలు అలలించనున్నాయని వెల్లడించారు.అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హనుమకొండ వేయి స్తంభాల ఆలయం వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రులు భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క తో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ మాట్లాడుతూ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పూలనే దైవంగా పూజించే విష్టమైన పండుగ బతుకమ్మ అని అన్నారు. బతుకమ్మను తీరొక్క పూలతో పేర్చినప్పుడే అది అందంగా ఉంటుందని పేర్కొంటూ, వరంగల్ మహానగరం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, వేయి స్తంభాల ఆలయం, భద్రకాళి అమ్మవార్ల సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. మామునూరు ఎయిర్‌పోర్ట్, టెక్స్టైల్ పార్క్ తదితర రంగాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దయతో వరంగల్ నగరం రాష్ట్ర రెండో రాజధానిగా ఎదుగుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై వరంగల్ ప్రజల విశ్వాసం, ప్రేమ ఇలాగే యథావిధిగా కొనసాగాలని కోరుతూ, ప్రజలందరి సహకారంతో వరంగల్ నగరాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి కృషి చేస్తానని ఎంపీ డా. కడియం కావ్య స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మేయర్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు.





