అమ్మవారిని దర్శించుకోవడం దివ్యమైన అనుభూతి
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విజయవాడ ఒకటి
భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్
విజయవాడ ప్రతినిధి సెప్టెంబర్ 24 ద్రోణ
దసరా శరన్నవరాత్రులలో మూడవ రోజు బుధవారం అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఉపరాష్ట్రపతికి రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, విఎంసి కమిషనర్ ధ్యానచంద్ర, దుర్గగుడి ఈవో శీనా నాయక్ స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి క్యూలైన్లలోని భక్తులకు అభివాదం చేస్తూ మహా మండపానికి చేరుకున్నారు. అక్కడ ఉపరాష్ట్రపతి దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధికి చేరుకొని అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు వేదాశీర్వచనం చేయగా, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో శీనా నాయక్ ఉపరాష్ట్రపతికి అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఉపరాష్ట్రపతి మీడియాతో మాట్లాడుతూ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోవడం దివ్యానుభూతి అని అన్నారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విజయవాడ ఒకటని చెప్పారు. రాష్ట్రం అద్భుతమైన వృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేశారు.



