కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
నిజామాబాద్ ప్రతినిధి అక్టోబర్ 17 ద్రోణ
కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను రిజిష్టర్ లలో నమోదు చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన మీదట వారికి రసీదులు అందించాలని, సదరు రైతు వివరాలు క్రాప్ బుకింగ్ డేటాలో నమోదై ఉన్నాయా అని పరిశీలించుకోవాలని సూచించారు. మోస్రా, చందూర్, వర్ని మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఆయా కేంద్రాలలో ఇప్పటివరకు ఎంత పరిమాణంలో వరి ధాన్యం సేకరించారు, ఎన్ని లారీల లోడ్ల ధాన్యం రైస్ మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లలో అన్ని వివరాలు సక్రమంగా రాయాలని, ట్రక్ షీట్లు వచ్చిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేయాలని, తద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయని అన్నారు. ప్రతి కేంద్రంలో సరిపడా గన్ని బ్యాగులు, గ్రెయిన్ క్యాలీపర్లు, మాయిశ్చర్ మీటర్లు, తూకం యంత్రాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోడింగ్, అన్ లోడింగ్ లో జాప్యం జరగకుండా సరిపడా హమాలీలను నియమించుకోవాలని కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. అన్ని కేంద్రాలకు అవసరమైన మేర టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు పంపాలన్నారు. లారీల కొరత తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా కల్పించారు. కొనుగోలు కేంద్రాల ఆవరణలో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి, రైతులకు పలు సూచనలు చేశారు. బాగా ఆరబెట్టి, శుభ్రపరిచిన ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చి పూర్తిస్థాయి మద్దతు ధర పొందాలని అన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ కోసం ఈసారి జిల్లాలో 670 పైచిలుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 300 వరకు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని కలెక్టర్ వెల్లడించారు. వరి కోతలు పూర్తయ్యి, ధాన్యం దిగుబడులు రావడం ప్రారంభం అవుతున్న విధంగా ఆయా ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ధాన్యం సేకరణలో జాప్యానికి తావు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతులు తెచ్చిన ధాన్యం నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్నట్లయితే, వెంటనే తూకం జరిపి, నిర్దేశిత రైస్ మిల్లులకు పంపడం జరుగుతుందని అన్నారు. మొక్కజొన్న పంట సాగు చేసిన ప్రాంతాలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సివిల్ సప్లైస్ డీ.ఎం శ్రీకాంత్ రెడ్డి, సహకార శాఖ అధికారి అంబర్ సింగ్, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కులకర్ణి సురేష్, స్థానిక అధికారులు ఉన్నారు.







