Wednesday, February 11, 2026

ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు

కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరిక

నిజామాబాద్ ప్రతినిధి అక్టోబర్ 19 ద్రోణ

ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు.
కొనుగోలు కేంద్రాల నుండి పంపించిన ధాన్యం నిల్వలను రైస్ మిల్లుల వద్ద వెంటదివెంట అన్ లోడింగ్ చేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ధాన్యం దిగుమతి చేసుకున్న వెంటనే ట్రక్ షీట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బోధన్ డివిజన్ లోని రుద్రూర్, పోతంగల్ మండల కేంద్రాలతో పాటు కోటగిరి మండలం కొత్తపల్లిలో ఐ.కె.పీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శనివారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి సందర్శించారు. కొనుగోలు కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి, రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువ ధాన్యం తూకం వేయకూడదని, ధాన్యం లోడింగ్, రవాణా కోసం రైతులు ఎవరికి కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, రైతులను నష్టపరిచే చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. తరుగు, కోతలను అమలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో ప్రతి ధాన్యం బస్తాను తప్పనిసరిగా కాంటా చేయాలని, ఆ తరువాతనే మిల్లులకు తరలించాలని అన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ఎక్కువ సంఖ్యలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, సరిపడా గన్నీ బ్యాగులను కేటాయించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా కొనసాగేలా కృషి చేయాలని అన్నారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే నిర్దేశిత ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని తూకం వేయించి, లారీలలో లోడ్ చేసి నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని అన్నారు. రైస్ మిల్లుల నుండి ట్రక్ షీట్లు తెప్పించుకుని వేగంగా ట్యాబ్ ఎంట్రీలు చేయాలని, తద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయని సూచించారు. వివిధ కారణాల వల్ల క్రాప్ బుకింగ్ జాబితాలో పేర్లు లేని రైతులు వాస్తవంగా పంట సాగు చేసినట్లయితే, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసుకుని అలాంటి రైతులకు ధృవీకరణ పత్రం అందించాలని వ్యవసాయ విస్తీర్ణ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని, ఎక్కడైనా అవకతవకలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, స్థానిక అధికారులు, కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular