సోయాబీన్ కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 11
బోధన్ మండలం చిన్నమావంది గ్రామంలో ఏర్పాటు చేసిన సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి తనిఖీ చేశారు. కేంద్రంలో రైతులకు అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. సోయాబీన్ పంట నాణ్యత, తేమ శాతంను పరిశీలించిన కలెక్టర్, ఇప్పటివరకు ఎన్ని క్వింటాళ్ల సోయాబీన్ సేకరణ జరిపారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద యంత్రం సహాయంతో పంటను శుభ్రం చేస్తున్న తీరును గమనించి, అధికారులకు సూచనలు చేశారు. రైతులు పంట ఉత్పత్తులు తెచ్చిన వెంటనే తేమ 12 శాతానికి లోబడి ఉంటే వెంటనే తూకం వేయించాలన్నారు. సేకరించిన పంటను జాగ్రత్తగా సీ డబ్ల్యూసీ గోడౌన్ లకు తరలించాలని అన్నారు. రైతులకు నిర్దిష్ట గడువు లోపు బిల్లుల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని , ఆదేశించారు. కాగా, మొక్కజొన్న, సోయాబీన్ సేకరణకు సంబంధించి పట్టా రైతు బయోమెట్రిక్ వేలి ముద్రను తప్పనిసరిగా తీసుకోవాలనే నిబంధనను అమలు చేస్తుండడం వల్ల తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు కౌలు రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, సడలింపు ఇవ్వాల్సిందిగా రైతుల పక్షాన మరోమారు కోరతామని అన్నారు. కలెక్టర్ వెంట మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ మహేష్, వ్యవసాయ అధికారి సంతోష్, స్థానిక అధికారులు ఉన్నారు.



