వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన కలెక్టర్
నిజామాబాద్ ప్రతినిధి నవంబర్ 25
మహిళా సాధికారత సాధనలో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే మహోన్నత సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం విస్తృత కార్యక్రమాలను అమలు చేస్తోందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గుర్తు చేశారు. బోధన్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు మంగళవారం బోధన్ పట్టణంలోని రోటరీ భవన్ కాన్ఫరెన్స్ హాల్ లో వడ్డీ లేని రుణాల చెక్కులను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సెగ్మెంట్ పరిధిలోని 3703 సంఘాలకు వడ్డీ లేని రుణాల రూపేణా ప్రభుత్వం రూ. 4.28 కోట్ల నిధులను వారి ఖాతాలలో జమ చేసింది. ఈ మేరకు మహిళా సమాఖ్యకు కలెక్టర్ లాంచనంగా చెక్కును అందజేశారు. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాకు వడ్డీ లేని రుణాల కింద ప్రభుత్వం 23.26 కోట్ల నిధులను కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఇతోధిక తోడ్పాటు గురించి ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, సమాఖ్య ప్రతినిధులు ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు ప్రకటించారు. బ్యాంకు లింకేజీ, వడ్డీ లేని రుణాలతో వ్యాపార లావాదేవీల నిర్వహణ ద్వారా సాధించిన ఆర్ధిక ప్రగతి గురించి వివరిస్తూ, తోటి సభ్యులలో స్పూర్తిని పెంపొందించారు. నాణ్యతతో కూడుకుని ఆకర్షణీయంగా ఉన్న ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తుండడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రణాలికాబద్దంగా కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి ప్రతి మహిళా సభ్యులు అవగాహన కలిగి ఉండాలన్నారు. అర్హులైన వారు వాటిని సద్వినియోగం చేసుకుని, ప్రభుత్వ లక్ష్యం దిశగా ముందుకు సాగుతారని సూచించారు. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం విరివిగా రుణాలు అందించడమే కాకుండా సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, యూనిఫాంల స్టిచింగ్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు వంటి వాటిని సైతం మంజూరు చేస్తోందని గుర్తు చేశారు. కేవలం ఆర్ధిక ప్రగతి మాత్రమే కాకుండా సామాజిక అభివృద్ధిని సైతం సాధించేలా మహిళలను చైతన్యవంతులను చేయాలని సంఘాల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, స్వయం సహాయక సంఘాలలో కొత్త సభ్యులను విరివిగా చేర్చుకుని, వారు కూడా ప్రభుత్వ తోడ్పాటును పొందేలా చొరవ చూపాలని అన్నారు. సభ్యుల సంఖ్య పెరిగితే సమిష్టి తత్వంతో వ్యాపారాలను మరింతగా విస్తరించుకునే అవకాశం ఉంటుందని అన్నారు. మండల సమాఖ్య సమావేశాలలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి విస్తృత చర్చ జరపాలన్నారు. మహిళల గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేసేలా ప్రభుత్వం 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తోందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ళను మహిళల పేరిట మంజూరు చేస్తోందని, మహిళా సంఘాల సభ్యులకు ఇంటి నిర్మాణం కోసం రుణాలను కూడా అందజేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో రూ. 67కోట్ల రుణాలు అందజేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. ప్రభుత్వ తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసిల్దార్ విఠల్, ఐ.కే.పీ డీపీఎం రాచయ్య తదితరులు పాల్గొన్నారు.



