ద్రోణ,నిజామాబాద్, మార్చి 05
బోధన్ పట్టణంలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
బోధన్ లోని విజేత జూనియర్ కళాశాల, ఉషోదయ, విద్యా వికాస్ జూనియర్ కాలేజీలలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉన్న తాగునీరు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలను పరిశీలించారు. సీసీ కెమెరా నిఘాలో పరీక్షలు జరుగుతున్నాయా లేదా అని గమనించారు. పలు కేంద్రాలలో లోపాలను గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బోధన్ పట్టణంలోని అన్ని పరీక్షా కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి తనకు వివరాలు తెలియజేయాలని డీ.ఐ.ఈ.ఓ రవికుమార్ ను ఆదేశించారు.
గురువారం ఫస్టియర్ గణితం-1బి, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్ష జరుగగా, ఆయా కేంద్రాలలో పరీక్షలకు గైర్హాజర్ అయిన విద్యార్థుల సంఖ్య గురించి కలెక్టర్ ఆరా తీశారు. విజేత జూనియర్ కళాశాలలో మొత్తం 441 మందికి గాను 12మంది గైర్హాజర్ అయ్యారని చీఫ్ సూపరింటెండెంట్ స్వర్ణలత తెలిపారు. ఉషోదయ కాలేజీలోని సెంటర్ లో 358 మందికి గాను 21 మంది హాజరు కాలేదని చీఫ్ సూపరింటెండెంట్ అనిల్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అలాగే, విద్యా వికాస్ జూనియర్ కాలేజీ లోని సెంటర్ లో 406 మంది విద్యార్థులకు 398మంది హాజరయ్యారని, 8 మంది గైర్హాజర్ అయినట్లు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ రవీందర్ తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎవరు కూడా సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తేకుండా, కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించాలని కలెక్టర్ సూచించారు. బాలికలను మహిళా సిబ్బంది తనిఖీ చేసే ప్రక్రియకు సహకారం అందించాలని ఏ ఎన్.ఎం లకు సూచించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో పక్కాగా పరీక్షలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.













