Saturday, March 14, 2026

కందకుర్తి పుష్కర ఘాట్ సందర్శన

ద్రోణ,నిజామాబాద్, మార్చి 14

రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్ ను ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. వచ్చే ఏడాది 2027లో జూన్ 26వ తేదీ నుంచి జులై 07వ తేదీ వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని జిల్లాలోని ప్రధానమైన ఈ పుష్కర ఘాట్ ను క్షేత్రస్థాయిలో సందర్శించి, చేపట్టాల్సిన పనుల గురించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గోదావరి, మంజీర, నదులు హరిద్ర నదుల కలయికతో త్రివేణి సంగమంగా ప్రసిద్ధి గాంచిన కందకుర్తి ప్రాంతానికి పుష్కర స్నానాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. గత పుష్కరాలను బట్టి చూస్తే ఈసారి కూడా ప్రతి రోజు సగటున రెండు లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యాలు ఏర్పడకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండేలా పక్కాగా పనులు జరిపించాలని అధికారులను ఆదేశించారు. వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు, తాత్కాలిక గదులు, భక్తులు బస చేసేందుకు వీలుగా తగిన వసతి, షామియానాలు, దుస్తులు మార్చుకునే గదులు వంటివి అందుబాటులో ఉండాలన్నారు. వీఐపీ, వీవీఐపీల కోసం కొత్తగా మరో ఘాట్ నిర్మించాలని సూచించారు. అన్ని ఘాట్ల వద్ద భక్తులకు పూర్తి స్థాయిలో పటిష్ట భద్రత కలిగి ఉండేలా రేయిలింగ్, రక్షణ కంచె ఏర్పాటు వంటి చర్యలు తీసుకోవాలని అన్నారు.
కాగా, పుష్కర ఘాట్ వద్ద అవసరమైన వాటికి పెయింటింగ్ చేయించి ఆకట్టుకునే రీతిలో పరిసరాలను ఆకర్షణీయంగా, అందంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. భక్తుల నుండి ఏ చిన్న ఫిర్యాదుకు సైతం ఆస్కారం లేకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రధాన మార్గం నుండి పుష్కర ఘాట్ల వరకు రోడ్డు వెడల్పు, మరమ్మతులు జరిపించాలని అన్నారు. అవసరమైన చోట కల్వర్తులు, వంతెనల నిర్మాణాలు కూడా జరిపించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యానికి తావు లేకుండా చేపట్టాల్సిన ప్రతి పనిని గుర్తిస్తూ సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular