కలెక్టర్ ఇలా త్రిపాఠి
ద్రోణ,నిజామాబాద్, ఏప్రిల్ 24
జిల్లాలోని ప్రతి నివాస ప్రాంతంలో ప్రజల అవసరాలకు సరిపడా సమృద్ధిగా తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి. అధికారులకు సూచించారు. ప్రస్తుత వేసవిలో ఎక్కడ కూడా దాహార్తి సమస్య తలెత్తకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అన్నారు. బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం బోధన్ బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలోని మండలాల ఎంపీడీఓలు, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఏ.ఈలు, ఎం.పీ.ఓ లు ఇతర అధికారులతో కలెక్టర్ మంచినీటి సరఫరా స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు.ఒక్కో మండలం వారీగా నీటి సరఫరా పరిస్థితి గురించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, చేపట్టాల్సి ఉన్న మరమ్మతులు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.వేసవి సీజన్ ను దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సూచించారు. రానున్న రెండు మూడు నెలలు ఎంతో కీలకమైనందున, నీటి సరఫరా విషయంలో ఏ దశలోనూ నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తతతో వ్యవహరించాలని అన్నారు. ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి కొరత ఏర్పడకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ, అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. పనులు చేపట్టడానికి ముందు స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించాలని సూచించారు. అదేవిధంగా మరమ్మతులు చేపట్టే విషయాన్ని ప్రజలకు సైతం ముందుగానే తెలియజేస్తే వారు తగిన విధంగా సన్నద్ధం అవుతారని సూచించారు. చేతి పంపులు, బోరు బావులకు అవసరమైన చోట తక్షణమే మరమ్మతులు జరిపించాలని, చేతి పంపులకు ఫ్లషింగ్ చేయించాలని అన్నారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పట్టణాలలో తాగునీటి సరఫరాపై సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరును పక్కాగా పర్యవేక్షణ జరపాలని, తాను కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, ఎక్కడైనా నిర్లక్ష్యానికి తావిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. మంచినీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని ఆదేశించారు. మారుమూల నివాస ప్రాంతాలకు సైతం రక్షిత మంచి నీటిని అందించేందుకు వీలుగా ఎడపల్లి మండలం జానకంపేట వద్ద ఏర్పాటు చేసిన తరహాలోనే అనంతగిరి, నెహ్రూనగర్ గ్రామాలకు సైతం సమృద్ధిగా తాగునీటి సరఫరా కోసం ఆన్లైన్ బూస్టర్ సిస్టమ్ ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కాగా, మంచినీటి సరఫరా వ్యవస్థకు ఎక్కడ కూడా అంతరాయం ఏర్పడకుండా చూడాలని, పైప్ లైన్లు, వాల్వ్ లకు నష్టం కలిగేలా వ్యవహరించే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని సూచించారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఎస్.ఈ రాజేందర్, డీపీఓ శ్రీనివాస్ రావు, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, మిషన్ భగీరథ ఈ.ఈలు రాకేష్, స్వప్న, డీఎల్పీఓలు శ్రీనివాస్, నాగరాజు, ఆయా మండలాల ఎంపీడీఓలు, ఏ.ఈలు, ఎంపీఓలు పాల్గొన్నారు.


