కలెక్టర్ ఇలా త్రిపాఠి
ద్రోణ,నిజామాబాద్, ఏప్రిల్ 29
నిజామబాద్ అర్బన్ పరిదిలోని మున్సిపల్ కార్పోరేషన్ మరియు నిజామాబాద్ రూరల్ లో ప్రతి నివాస ప్రాంతం ప్రజల అవసరాలకు సరిపడా సమృద్ధిగా తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. ప్రస్తుత వేసవిలో ఎక్కడ కూడా దాహార్తి సమస్య తలెత్తకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బుదవారం నిజామాబాద్ అర్బన్ మరియు రూరల్ లో నగర ప్రజలకు మంచి నీటి కొరత రాకుండా చూడాలని అధికారులతో మంచి నీటి సరఫరా స్థితిగతులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఒక్కో మండలం వారీగా నీటి సరఫరా పరిస్థితి గురించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, చేపట్టాల్సి ఉన్న మరమ్మతులు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.వేసవి సీజన్ ను దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సూచించారు. రానున్న రెండు మూడు నెలలు ఎంతో కీలకమైనందున, నీటి సరఫరా విషయంలో ఏ దశలోనూ నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తతతో వ్యవహరించాలని అన్నారు. ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి కొరత ఏర్పడకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ, అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. పనులు చేపట్టడానికి ముందు స్థానిక ప్రజాప్రతి
నిధులను సంప్రదించాలని సూచించారు. అదేవిధంగా మరమ్మతులు చేపట్టే విషయాన్ని ప్రజలకు సైతం ముందుగానే తెలియజేస్తే వారు తగిన విధంగా సన్నద్ధం అవుతారని సూచించారు. చేతి పంపులు, బోరు బావులకు అవసరమైన చోట తక్షణమే మరమ్మతులు జరిపించాలని, చేతి పంపులకు ఫ్లషింగ్ చేయించాలని అన్నారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పట్టణాలలో తాగునీటి సరఫరాపై సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరును పక్కాగా పర్యవేక్షణ జరపాలని, తాను కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, ఎక్కడైనా నిర్లక్ష్యానికి తావిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. మంచినీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ దిలీప్, ఆర్.డబ్ల్యూ. ఎస్ ఈ రాజేందర్, డీపీఓ శ్రీనివాస్ రావు, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, ఆయా మండలాల ఎంపీడీఓలు, ఏ.ఈలు, ఎంపీఓలు పాల్గొన్నారు.




