Wednesday, June 10, 2026

నిజాంసాగర్, శ్రీరాంసాగర్ సామర్థ్యం పెంపు

కాలువ కట్టలపై సోలార్ విద్యుత్ ఉత్పత్తికి తక్షణ చర్యలు

ఎత్తిపోతలు ప్రారంభించిన
మంత్రి

ద్రోణ,నిజామాబాద్, జూన్ 10

ఉత్తర తెలంగాణ జిల్లాలలోని సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కార్ తదితరులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రిజర్వాయర్ కు సంబంధించిన వివరాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. 106 కోట్ల రూపాయల వ్యయంతో 7,975 ఎకరాల ఆయకట్టుకు నీరందించే జాకోరా, చందూర్ ఎత్తిపోతల పథకాలను అట్టహాసంగా ప్రారంభించారు. హెలికాప్టర్ లో సిద్దాపూర్ చేరుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్, నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర, నిజామాబాద్ అదనపు డీసీపీ శుభం నగ్రాలే, డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ తదితరులు హెలిప్యాడ్ వద్ద పుష్ప గుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జాకోరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి, పౌర సరఫరాలకు ఎనలేని ప్రాముఖ్యత ఇస్తోందని గుర్తు చేశారు. భూసేకరణ, అటవీ అనుమతులు, ఆర్ అండ్ ఆర్ తదితర వాటి కోసం ప్రభుత్వం రూ. 5వేల కోట్లు కేటాయిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేలా చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఇందులో భాగంగానే లోయర్ మానేరు, మిడ్ మానేరు డ్యామ్ లు, కడెం ప్రాజెక్టులలో నీటి నిల్వ సామర్థ్యం పెంపొందించేందుకు
పూడికతీత చేపడుతున్నామని తెలిపారు. అదే తరహాలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్, ఉత్తర తెలంగాణ జిల్లాలకు అత్యంత కీలకమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులలో కూడా పూడికతీత చేపట్టి రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం పెంపొందిస్తామని ప్రకటించారు. కాలువ కట్టలపై సోలార్ విద్యుత్ ఉత్పత్తికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజి లోపభూయిష్ట నిర్మాణం, డిజైన్ల వల్ల కొన్నాళ్ళకే కూలిపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆక్షేపించారు. రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీలను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని, అయినప్పటికీ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో కట్టిన మేడిగడ్డ బ్యారేజి కొన్ని రోజులకే కూలిపోవడం జరిగిందని, కానీ నిజాం నవాబు నిర్మించిన నిజాంసాగర్, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించబడిన శ్రీరాంసాగర్, నాగార్జున సాగర్, జూరాల ప్రాజెక్టులు మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎంతో గట్టిగా నిలబడి ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. కాగా, సిద్దాపూర్ రిజర్వాయర్ పనుల పూర్తి కోసం సవరించిన ప్రతిపాదనల మేరకు అవసరమైన నిధులను తప్పక కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రైతాంగ ప్రయోజనాలు కాపాడడమే పరమావధిగా తమ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని తెలిపారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణలో ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లు కలుపుకుని 295 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. అందులో ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాల ద్వారా 145 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, 48గంటల లోపే రైతుల ఖాతాలలో బిల్లులు జమ చేస్తూ రూ. 35 వేల కోట్లు చెల్లించామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో సైతం రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి భరోసా కల్పించారు.
నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని 5లక్షల కుటుంబాలలోని 3.25 కోట్ల మందికి ఒక్కొక్కరికి ప్రతీ నెల ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు.
ప్రభుత్వ సలహాదారు, స్థానిక శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొట్టమొదటగా తన నియోజకవర్గంలో జాకోరా, చందూర్ ఎత్తిపోతల పోతకాలను ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణంలో బాన్సువాడ నియోజకవర్గ రైతులు పంటలు సాగు చేస్తూ, అధిక దిగుబడులు సాధిస్తున్నారని అన్నారు. మొత్తం లక్షా 48 వేల ఎకరాలలో పంటలు పండిస్తున్నారని, 95వేల ఎకరాల ఆయకట్టుకు నిజాంసాగర్ నీరు సమకూరుతోందని తెలిపారు. 30 వేల ఎకరాలకు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగు జలాలు అందిస్తున్నామని, నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో లేని మిగతా భూములకు కూడా సాగు జలాలు అందించాలనే కృత నిశ్చయంతో సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టామని అన్నారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే నియోజకవర్గంలో సాగు నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్ రావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ శ్రీనివాస్, సీ.ఈ శ్రీదేవి, బోధన్ ఆర్డీఓ విజయలక్ష్మి, తహసిల్దార్ ప్రశాంత్, సర్పంచ్ సాయిలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular