కరువు పై శాస్త్రవేత్తల హెచ్చరిక
ఆందోళన లో రైతన్న
వరి పంట సాగుపై అన్నదాత మొగ్గు
వర్షాకాలం ఆరంభం మై 15 రోజులు గడుస్తున్నప్పటికీ వరుణుడు కరుణించకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. గత 15 ఏళ్ల నుండి వరుణదేవుడు కరుణించడంతో తెలంగాణ ప్రాంతంలో సమృద్ధిగా పంటలు పండాయి. ప్రస్తుత తరణము లో దేశంలో కరువు తాండవించబోతుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ధాన్యానికి భాండాకారంగా మారింది. ప్రకృతి సహకరించడంతో తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ రబి లోను పంటలు పండుతూ వచ్చాయి. పంటలు సక్రమంగా పడడం, ప్రభుత్వాలు కొంతమేరకు రైతులకు అండదండలు అందించడంతో రాష్ట్ర రైతాంగం కొంత మేరకు సంతృప్తి చెందింది. మరోపక్క భూమి విలువలు అమాంతం పెరగడంతో రైతులు కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టం చేయడమే రైతన్నలకు అంతిమ లక్ష్యంగా భావిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రకృతి కన్నీరు చేసినప్పటికీ, ప్రస్తుత రబీలో దిగుబడులు అత్యధికంగా రావడం, పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి సకాలంలో రైతుల ఖాతాల్లో డబ్బులు చెల్లించడం ఎంతో అభినందనీయం. ఇటువంటి తరుణంలో రైతులు పంట మార్పిడికి ససేమేరా అన్న చందంగా ఉన్నారు. పంటల మార్పిడి కి నిజామాబాద్ జిల్లా భూములు అనుకూలంగా లేవని రైతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పంటల మార్పిడికి కూలీల కొరత తలనొప్పిగా మారిందని మరోపక్క వ్యక్తం చేస్తున్నారు.
వరి పంటపై రైతన్న మొగ్గు
నిజామాబాద్ జిల్లా రైతాంగం వరి పంట పైనే మొగ్గు చూపుతున్నారు. కరువు తాండవిస్తుందన్న ఆందోళన ఒకపక్క ఉన్నప్పటికీ ఇతర పంటలు పండించే పరిస్థితులు లేవని అన్నదాతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నప్పటికీ వరుణదేవుడు కరుణించడం లేదు. మరోపక్క భానుడు ప్రతాపం తీవ్రంగా ఉంది. వర్షాకాలం అయినప్పటికీ ఎండా కాలాన్ని తలపిస్తున్నట్లుగా భానుడు ప్రతాపాన్ని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. నిజామాబాద్ జిల్లా రైతాంగం నిజాంసాగర్ ప్రాజెక్టు, వ్యవసాయ బోర్లపై పంటల సాగును కొనసాగిస్తున్నారు. నిజాంసాగర్ లో కొద్దిపాటి నీటి నిల్వలు ఉండడంతో ప్రాజెక్టుపై గంపెడు ఆశల్లో రైతులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో బాన్సువాడ నియోజకవర్గం పంటల సాగులో, దిగుబడుల్లో సైతం ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రంలోనే నిలుస్తున్నారు. వరి పంట సాగులో ప్రతి ఏడాది దేశంలోనే ముందస్తుగా వరి నాట్లు సాగు చేస్తున్నారు. రబీలో వరి పంటను ముందస్తుగా సాగు చేసి తమ పంటలను నెలరోజుల క్రితమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్మకాలు పూర్తి చేశారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలం ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా ధాన్యం అమ్మకాలు చేపడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు రైతులకు అండగా నిలిచి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సైతం ముందస్తుగా వరి నాట్లు పూర్తిచేసుకునేందుకు రైతన్నలు సిద్ధంగా ఉన్నారు. నెల రోజుల క్రితమే వరి నారుమళ్లను ఎత్తుకొని ప్రస్తుతం వరి నాట్లు ఆరంభం కూడా చేశారు. వరుణదేవుడు కరుణించినప్పటికీ వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్న బోరుబావుల ద్వారా ఈ ప్రాంత అన్నదాతలు వరి నాట్లు వేసుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ రైతులు ఒకపక్క ఆందోళన వ్యక్తం చేస్తూ మరోపక్క వరి పంట సాగు చేయడమే లక్ష్యంగా భావిస్తున్నారు. పంటలు మార్పిడి చేయాలన్న ఈ ప్రాంతంలో భూములు అనుకూలంగా లేకపోవడం మరోపక్క కూలీల కొరత తీవ్రంగా ఉందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పంట సాగుకు యంత్రాలను ఉపయోగించడంతో కొంతవరకు రైతుల కష్టాలు తీరాయనే, చెప్పవచ్చు. ప్రభుత్వాలు సైతం వరి పంటకు మొగ్గు చూపిస్తున్నట్లుగా కనిపిస్తుంది. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలు అందిస్తామని ఎన్నికల్లో హామీల వర్షం కురిపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంటల సాగుకు పెట్టుబడి తో పాటు, పండించిన ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ అందించడం మరింత రైతులకు ఊరటం కలిగించింది. ఇతర పంటలను సాగు చేస్తున్న రైతాంగానికి సైతం ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తే పంటల మార్పిడికి కొంత వీలు కలుగుతుంది. గత 15 రోజులుగా బాన్స్వాడ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో రైతులు వరి పంటను నాటుకుంటున్నారు. నిజాంసాగర్ లో ఉన్న కొద్దిపాటి నీటి నిల్వలను విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ ప్రాంత రైతులు వేడుకుంటున్నారు. ప్రస్తుత తరుణంలో వరి నాట్లు ముగించుకోకపోతే వరి నారు ముదిరిపోయి పంటసాకు వీలుకాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గం కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతినిత్యం పంటల సాగుపై ఆలోచన చేస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే పరిస్థితులకు అనుకూలంగా ఎప్పటికప్పుడు ముందస్తు నిర్ణయాలు చేస్తూ రైతులకు అండదండలు అందిస్తున్నారు. ఈ ప్రాంత రైతులు చైతన్యవంతులు కావడం పోచారం ఆలోచనలు ఏకమై దేశంలోనే పంటల సాగులో ముందస్తు తో పాటు అధిక దిగుబడులు నాణ్యమైన పంటలను పండించడం ఈ ప్రాంత రైతులు అలవర్చుకున్నారు. వరుణదేవుడు కరుణించాలని రైతన్నలు వేడుకుంటున్నారు.
వాతావరణంలో పెను మార్పులు
భారతదేశ వాతావరణ శాస్త్రవేత్తలు ఓ పక్క హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగానే వాతావరణం లో ఇప్పటికే పెను మార్పులు చోటు చేసుకున్నాయి. వర్షాకాలంలో సైతం ఎండా కాలాన్ని తలపించే విధంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాబోయే రోజులు ఇంకా ఎంత ప్రమాదంగా మారుతాయని రైతులలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరగడంతో పంటల సాగుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భవిష్యత్తులో వర్షాలు సమృద్ధిగా కురవకపోతే భూగర్భ జలాలు అడుగంటి పోతాయి, నిజాంసాగర్ లో ఉన్న కొద్దిపాటి నిల్వలు జరిగిపోతాయి. బోర్ల ద్వారా ఆధారపడి ప్రస్తుతం వరి పంటను సాగు చేస్తున్నారు. గత 15 ఏళ్లుగా ప్రకృతి కొన్ని సందర్భాల్లో కన్నెర్ర చేసినప్పటికీ పంటల సాగు అనుకూలంగా కొనసాగింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సైతం బాన్సువాడ నియోజకవర్గ రైతాంగం ముందస్తుగా వరి నాట్లు పూర్తి చేసుకొని కరువు తాండవించే పరిస్థితులను తట్టుకునేందుకు ముందస్తు వారి సాగు చేయడమే తమకు మార్గంగా ఎంచుకుంటున్నారు. వర్షాకాలంలో ఎంతో కొంత వర్షాలు పడతాయి అన్న నమ్మకంతో రైతులు ముందుకు వెళుతున్నారు. అడవులు నశించడం, మరో పక్క పంటల సాగు కోసం భూముల్లో ఉన్న చెట్లను తొలగించడం, అభివృద్ధి పేరిట రోడ్ల వెంట ఉన్న మహా వృక్షాలను సైతం తొలగించడంతో ఇప్పటికే ప్రకృతి లో సమతుల్యం లోపించింది. మరోపక్క వర్షాలు సమృద్ధిగా కురిసిన సందర్భంలో సైతం భూమిలోకి నీరు వెనకకుండా అభివృద్ధి పేరిట సిమెంట్ కాంక్రీట్ చేయడం పెద్ద ప్రమాదంగా మారింది. నేడు హైదరాబాదు లాంటి మహానగరాల్లో తాగునీరు దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో 400 మీటర్ల నుండి 700 మీటర్ల వరకు బోరు బావులు తాగుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటై అన్న విషయానికి హైదరాబాద్ మహానగరమే నిదర్శనం. శాస్త్రవేత్తల హెచ్చరికలు నిజమైతే హైదరాబాద్ లాంటి మహానగరాలు నీటి కోసం ఎదురయ్యే కష్టాలను ఎప్పటినుండే అంచనాలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత జరుగుతున్న నగరాల్లో ఇంకుడు గుంతల వైపు, చెట్ల పెంపకం వైపు ప్రభుత్వాలు మరియు ప్రజలు మొగ్గు చూపకపోవడం ఎంతవరకు సమంజసం. ఇలానే ప్రజలందరూ కళ్ళు మూసుకొని కాలాన్ని వెల్లదీసుకుందామనుకుంటే రాబోయే తరాలకు తీవ్ర నీటి కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. తాగేందుకు నీరే దొరకనప్పుడు పంటల సాగుకు నీరు లభించేది ఎలా?, ప్రకృతి వైపరీత్యాలు కొనసాగితే మానవ మనుగడకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. వాతావరణం సమతుల్యం లోపించడంతో ప్రకృతి వైపరీత్యాలు కొనసాగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అత్యధిక వర్షపాతం, మరి కొన్ని సందర్భాల్లో అత్యల్ప వర్షపాతం, మరోపక్క పెద్ద ఎత్తున గాలులు విచి దేశాన్ని చిన్నాభిన్నం చేసే శక్తి వాతావరణం కు మాత్రమే ఉన్నదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి.





