Sunday, September 27, 2026

ఐఐటీ,ఐఐఐటీ ,ఎన్ఐటీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు

వ్యవసాయ కళాశాలలో ఎంజేపి విద్యార్థులకు అవకాశం

బీసీ గురుకులాల సమావేశంలో కీలక తీర్మానాలు మంత్రి పొన్నం

హైదరాబాద్, ద్రోణ జూన్ 25

రాష్ట్ర సచివాలయంలో మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ (MJPTBCWREIS) 6వ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం గురువారం మంత్రిపన్నం ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించారు. విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక వసతుల అభివృద్ధి, పరిపాలనా బలోపేతానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
సమావేశంలో పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ప్రాంతీయ సమన్వయ కార్యాలయాల వివిధ విభాగాలకు బడ్జెట్ పరిమితులను బోర్డు ఆమోదించింది.
ఎంజేపీ బీసీ గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు మరణించిన సందర్భాల్లో వారి తల్లిదండ్రులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది.
ప్రిన్సిపాల్ (పాఠశాల) నియామకాలకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న 70 శాతం పదోన్నతులు, 30 శాతం ప్రత్యక్ష నియామకాల విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు.
వ్యవసాయ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి కేవలం ఎంజేపీ గురుకుల విద్యాసంస్థల విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది.విద్యా పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పదవీ విరమణ చేసిన ప్రిన్సిపాళ్ల సేవలను అకడమిక్ కన్సల్టెంట్లుగా వినియోగించుకునే అంశంపై నియామక నిబంధనలను రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు చేసి తదనుగుణంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
ఐఐటీలు, ఐఐఐటీలు, ఎన్ఐటీలు వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు సాధించిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించాలని బోర్డు నిర్ణయించింది.ఇతర విద్యాసంస్థల సంఘాల తరహాలోనే సంస్థ పేరును తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ (TGWCWMJPREIS) గా మార్చాలని బోర్డు నిర్ణయించింది.
ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలల్లో డెస్క్‌టాప్ కంప్యూటర్ల కొనుగోలు, జూనియర్ కళాశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్సరఫరాకు ఆమోదం తెలిపింది.రాష్ట్రంలో 12 సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న ఆమోద స్థితిపై పూర్తి నివేదిక సమర్పిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. మంత్రి మాట్లాడుతూ, బీసీ విద్యార్థులకు అత్యుత్తమ విద్యా అవకాశాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యా ప్రమాణాల పెంపు, పోటీ పరీక్షల్లో విజయాలు, జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో అధిక ప్రవేశాలు సాధించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయాలు సంస్థను మరింత బలోపేతం చేయనున్నాయని మంత్రి వెల్లడించారు.ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాలమయాదేవి, ఎంజేపీ బీసీ గురుకులాల కార్యదర్శి సైదులు, వివిధ విభాగాల అధికారులు, బోర్డు సభ్యులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular