Wednesday, July 22, 2026

వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను సన్నద్ధం చేయాలి

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్

వరంగల్, ద్రోణ జూలై 20

ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను సన్నద్ధం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎల్‌నీనో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాల నేపథ్యంలో రైతులకు తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా లెమన్ గ్రాస్ వంటి ఆదాయాన్ని అందించే ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని స్పష్టం చేశారు.వర్షాభావ పరిస్థితుల్లో పశుసంవర్థక రంగానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి అవసరాలకు సరిపడా నీటి లభ్యతపై వెంటనే సమగ్ర నివేదికలు సిద్ధం చేసి అందించాలని మంత్రి సూచించారు.వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పైస్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరూ సమన్వయంతో పనిచేయాలని, ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టడం ద్వారానే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడగలమని మంత్రి అన్నారు.ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ, రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సామాజిక బాధ్యతతో పనిచేస్తే వర్షాభావ పరిస్థితులను విజయవంతంగా అధిగమించవచ్చని మంత్రి పేర్కొన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ,తెలంగాణ శాసనసభ డిప్యూటి స్పీకర్ రాంచంద్రునాయక్ , ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ,ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి ,గండ్ర సత్యనారాయణ రావు, దొంతి మాధవ రెడ్డి, కడియం శ్రీహరి ,కె.ఆర్. నాగరాజు , డా. మురళి నాయక్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్ , ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular