బోధన్ పోలీస్ స్టేషన్ ను చేసిన డి.ఐ.జి
ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్
ఇన్వెస్ట్రిగేషన్ నందు నూతన టెక్నాలజీ పద్ధతులను ఉపయోగించాలి
నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలని, ప్రజలతో స్నేహ పూర్వకంగా మెలగడం పోలీస్ అధికారుల బాధ్యతగా గుర్తించాలని డిఐజి భాస్కరన్ పేర్కొన్నారు.
బోధన్ పోలీస్ స్టేషన్‌ను బాసర జోన్ డిఐజి ఆర్. భాస్కరన్ పోలీస్ స్టేషన్ తనిఖీలు నిర్వహించారు.
డి.ఐ.జి కి పోలీస్ అధికారులు , సిబ్బంది గౌరవ వందనం అందించగా , ఆయన వందనాన్ని స్వీకరించి అనంతరం స్టేషన్‌లోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్‌లో సిబ్బందికి అందుబాటులో ఉన్న భద్రతా పరికరాలు , ఆయుధాల నిర్వహణ , రికార్డుల సంరక్షణ తదితర అంశాలను పరిశీలించి వాటి నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం రిసెప్షన్ సెంటర్‌ను సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న రిజిస్టర్లు , ఫిర్యాదుల నమోదు విధానం , ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని గౌరవంతో స్వాగతించి , వారి సమస్యలను ఓర్పుతో విని వెంటనే స్పందించే విధంగా సిబ్బంది వ్యవహరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న అన్ని రకాల రికార్డులను పరిశీలించారు. కేసుల నమోదు , పెండింగ్ కేసుల దర్యాప్తు , బీట్ డ్యూటీ వ్యవస్థ , రౌడీషీటర్లు మరియు నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై పర్యవేక్షణ వంటి అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్‌లో అమలవుతున్న “5 ఎస్ విధానం” అమలు తీరును సమీక్షించి , ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడంలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మహిళలు , వృద్ధులు , అత్యవసర సహాయం కోసం వచ్చే ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని స్పందించాలని తెలిపారు.
స్టేషన్ పరిసరాల పరిశుభ్రత , రికార్డుల డిజిటల్ నిర్వహణ , సిబ్బంది హాజరు , డ్యూటీ విధానాలు తదితర అంశాలపై కూడా డి.ఐ.జి ఆరా తీశారు. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం పెరిగేలా క్రమశిక్షణతో , పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. ప్రధానంగా అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని , ప్రతి కేసులో నాణ్యమైన , ఇన్వెస్టిగేషన్ చేయాలని సబ్ ఇన్స్పెక్టర్ కు సూచనలు చేశారు.
ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాల జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు , కళాశాలలో మరియు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో గల విలేజ్ పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేసి , అట్టి ప్రాంతాలలో ఉన్నటువంటి సమాచారము తమపై స్థాయి అధికారులకు ఎల్లప్పుడూ చేరవేయాలి అన్నారు.బోధన్ పోలీస్ స్టేషన్ సరిహద్దులో మహారాష్ట్ర వునందున అన్నీ ప్రధాన రహదారులపై నిఘా పటిష్టపరిచాలని అన్నారు.ప్రతి రోజు ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పలు సూచనలు చేశారు.
సులభ మార్గంలో అధిక డబ్బులు సంపాధించాలనే అత్యాశతో యువత ఆన్లైన్ బెట్టింగ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ, సైబర్ మోసగాళ్ళ చేతిలో చిక్కి డబ్బులు కోల్పోతూ అప్పులు చేసి , చేసిన అప్పులను తీర్చలేక తనువును చాలిస్తున్నారని అన్నారు. గేమింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
డ్రగ్స్ నియంత్రణ కోసము యువతను ఎల్లప్పుడూ చైతన్యవంతులను చేయాలని మరియు అన్ని గ్రామాలలో డ్రగ్స్ వాడకం నిషేధము అని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు.ప్రతీ కేసులో ఇన్వెస్టిగేషన్ నందు ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ పద్ధతులను ఉపయోగించుకోవాలని అన్నారు.ఈ తనిఖీలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయ చైతన్య, బోధన్ ఎసిపి శ్రీనివాస్ , బోధన్ ఎస్హెచ్ఓ వెంకటనారాయణ , బోధన్ ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ , బోధన్ టౌన్ ఎస్సై హబీబ్ ఖాన్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

















