పంటల రక్షణకు నీటి విడుదల పోచారం
నిజామాబాద్ ఆగస్టు 8 ద్రోణ
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుకు నీటి వినియోగంపై రైతులకు సాంకేతిక సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో నిజామాబాద్ ఇంచార్జి కలెక్టర్ భవేష్ మిశ్రా అధ్యక్షతన ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిపోవడంతో ప్రస్తుతం సాగులో ఉన్న వరి పంట తీవ్రంగా ప్రభావితమవుతోందని పోచారం పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని, తక్కువ నీటితో పంటను ఎలా సంరక్షించుకోవాలో రైతులకు తక్షణమే సాంకేతిక సలహాలు అందించాలని అధికారులకు తగు సూచనలు చేశారు.
ప్రస్తుత వానాకాలంలో వరి సాగు కష్టసాధ్యంగా మారుతున్నందున, రైతులు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేయాలని సూచించారు. ఇక నిజాంసాగర్ ప్రాజెక్టులో అనుకున్న స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడం వల్ల భవిష్యత్తులో నీటి పంపిణీపై ప్రభావం పడే అవకాశముందని తెలిపారు, ఈ నేపథ్యంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, నీటి వినియోగంలో మితవాదం పాటిస్తూ అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు, అవసరానికి అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో నీటిని విడుదల చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రతి గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ సూచనలు రైతులకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశం ద్వారా వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోబడినట్లు పోచారం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.



