గోదావరి జలాలపై రైతుల ఆశలు!
నిజామాబాద్, ప్రతినిధి నవంబర్ 1 (ద్రోణ):- మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన 14 గేట్లను గురువారం మూసివేయడంతో గోదావరి జలాల ప్రవాహంపై చర్చ మొదలైంది.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి ఏడాది వర్షాకాలంలో జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను తెరిచి ఉంచుతారు. ఈ గడువు ముగియడంతో అధికారులు గేట్లను మూసివేశారు. బాబ్లీ ప్రాజెక్టు నుంచి గోదావరిలో ప్రవహించే నీరు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరుతుంది. ఈ జలాలు తెలంగాణలో వ్యవసాయ సాగుతో పాటు తాగునీటి అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా గోదావరి నీటిపై ఆధారపడే రైతులకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కీలకంగా ఉండటంతో, నీటి లభ్యతపై ఆసక్తి నెలకొంది.