
నిలోఫర్ ఆసుపత్రిలో చిన్నారులను పరామర్శించిన పోచారం శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ప్రతినిధి నవంబర్2 (ద్రోణ):– నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం తాడ్కోల్ గ్రామ శివారులో నాటు బాంబుల పేలుడు ఘటనలో గాయపడిన చిన్నారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దండ్ల అంజలి (3), దండ్ల శ్రీదేవి (5)లను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

బాన్సువాడ గ్రామీణ మండలం తాడ్కోల్ గ్రామ శివారులోని ఎర్రమన్ను కుచ్చ ప్రాంతంలో ఆదివారం పందుల వేట కోసం ఉపయోగించే పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలడంతో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరిని మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్, హైదరాబాద్‌లోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఇద్దరు చిన్నారులకు నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి నిలోఫర్ ఆసుపత్రికి వెళ్లి చిన్నారులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులను ఆరా తీశారు. చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని వైద్యులకు సూచించారు.
అనంతరం చిన్నారుల కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. చిన్నారులు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా నిలోఫర్ ఆసుపత్రి ఆర్‌ఎంఓ, సూపరింటెండెంట్, తాడ్కోల్ సర్పంచ్ రమేష్, మాజీ జడ్పీటీసీ గోపాల్ రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.