బతికున్న వారిని రికార్డులలో చనిపోయినట్లు నమోదు!

22 మందికి నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు

ఈ-సంతకాల వ్యవస్థ దుర్వినియోగం..

బీమా సొమ్ము కాజేసేందుకు కుట్ర?

పంచాయతీ కార్యదర్శి, ప్రైవేట్ వ్యక్తిపై పోలీసుల కేసు నమోదు

సిద్దిపేట, ప్రతినిధి నవంబర్ 10 ( ద్రోణ):- ప్రభుత్వ రికార్డుల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం, డిజిటల్ వ్యవస్థల భద్రతలో లోపాలు ఏ స్థాయికి చేరాయో తెలియజేసే ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగుచూసింది. బతికున్న 22 మంది గ్రామస్థులను ప్రభుత్వ రికార్డులలో మరణించినట్లుగా నమోదు చేసి, వారి పేర్లతో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. చేర్యాల మండలం రాంపూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రభుత్వ డిజిటల్ సేవల భద్రత పై పలు అనుమానాలకు తావిస్తోంది.

అధికారిక ఈ-సంతకం ప్రైవేట్ వ్యక్తి చేతికి..

రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న భుక్య మధు తన వద్ద భద్రంగా ఉంచుకోవాల్సిన అధికారిక ఈ-సంతకం పరికరాన్ని (ఈ-సైన్ డాంగిల్) అదే గ్రామానికి చెందిన షేవల్ల రమేష్‌కు అప్పగించినట్లు విచారణలో వెల్లడై నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఇంటర్నెట్ కేంద్రం నిర్వహిస్తున్న రమేష్‌కు ఈ విధంగా అధికారిక డిజిటల్ వ్యవస్థను వినియోగించే అవకాశం లభించినట్లు తెలుస్తోంది. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ రికార్డులలో అక్రమ మార్పులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఎనిమిది నెలల్లో 22 నకిలీ ధ్రువీకరణ పత్రాలు

2026 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు గ్రామానికి చెందిన 22 మంది జీవించి ఉన్న వ్యక్తులను మరణించినట్లుగా నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. కార్యదర్శికి సంబంధించిన అధికారిక ఈ-సంతకాన్ని ఉపయోగించి వారి పేర్లతో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు రూపొందించి జారీ చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ అనుమతులు, ధ్రువీకరణ ప్రక్రియలను పక్కనపెట్టి డిజిటల్ అధికారాలను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

బీమా క్లెయిమ్‌లే లక్ష్యంగా అనుమానాలు

ఈ అక్రమాల వెనుక ఆర్థిక ప్రయోజనాల కోణం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆయా వ్యక్తుల పేర్ల పై ఉన్న జీవిత బీమా పాలసీలను ఆధారంగా చేసుకుని, వారు మరణించినట్లు నకిలీ పత్రాలు సమర్పించి బీమా పరిహారం పొందేందుకు కుట్ర పన్నినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో ఎంత మేరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయి? ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే అంశాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

కలెక్టర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

ఈ వ్యవహారం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో కలెక్టర్ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. ఘటన పై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సంబంధిత అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇద్దరిపై కేసు.. మరింత లోతుగా దర్యాప్తు

అధికారిక డిజిటల్ సంతకాల దుర్వినియోగం, నకిలీ ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించి పంచాయతీ కార్యదర్శి భుక్య మధు, ప్రైవేట్ వ్యక్తి షే వల్ల రమేష్‌ పై చేర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అక్రమ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉందా? బీమా సంస్థలకు తప్పుడు క్లెయిమ్‌లు సమర్పించారా? ఎవరైనా మధ్యవర్తులు సహకరించారా? అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

బతికున్న వ్యక్తులను ప్రభుత్వ రికార్డుల్లోనే మరణించినట్లుగా చూపించిన ఈ ఘటనతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ డిజిటల్ ధ్రువీ కరణ వ్యవస్థల నిర్వహణలో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని ఈ ఉదంతం మరోసారి గుర్తుచేస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular