రైతులకు పరిహారం..

ప్రజలకు నిత్యావసరాలు

తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి

కేంద్రానికి పంపిన నివేదికను ప్రజల ముందుంచాలి

ఎండిపోయిన పంటలకు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి పరిహారం చెల్లించాలి

రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టాలి

సీపీఐ జాతీయ నాయకురాలు పశ్య పద్మ డిమాండ్

నిజామాబాద్ ప్రతినిధి నవంబర్ 10( ద్రోణ):- ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షా భావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. కరువు పరిస్థితుల పై కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికను బహిర్గతం చేయడంతో పాటు, కరువు పరిస్థితుల అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన ఉప సంఘానికి బహుళ విభాగాల నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను కూడా ప్రజలకు వెల్లడించాలని సీపీఐ జాతీయ నాయకురాలు పశ్య పద్మ కోరారు.

రాష్ట్రంలో నెల కొన్న కరువు పరిస్థితులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, వివిధ రంగాలలో ఉన్న కార్మికులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పశ్య పద్మ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ఎండిపోయిన పంటలను సమగ్రంగా సర్వే చేసి నష్టాన్ని నమోదు చేయాలని, తక్షణమే అఖిల పక్షాలు, రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

కరువు నివారణ, పంట నష్ట పరిహారం, సహాయక చర్యలకు అవసరమైన నిధులపై వాస్తవ పరిస్థితుల ఆధారంగా నివేదికలు రూపొందించి కేంద్రానికి పంపాలని సూచించారు. కేంద్రం పై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి అవసరమైన నిధులను సాధించాలని అన్నారు. చేతి కొచ్చే దశలో ఉన్న వరి పంటను కాపాడేందుకు సాగు నీరు అందించడంతో పాటు విద్యుత్ కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు వరికి రూ.30 వేలు, పత్తి, మిర్చి పంటలకు రూ.50 వేలు, ఇతర పంటలకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులలో అందుబాటులో ఉన్న నీటి నిల్వల వివరాలను శ్వేత పత్రం ద్వారా ప్రకటించాలని, తాగు నీటి ఎద్దడి నివారణకు గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. రబీ పంటల సాగుకు అను కూల పరిస్థితులు లేనందున రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని, కౌలు రైతులను గుర్తించి వారికి కూడా పంట నష్ట పరిహారం అందించాలని స్పష్టం చేశారు.

చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకం కింద అదనపు పనిదినాలు కల్పించాలని, పశువులకు అవసరమైన మేతను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. కరువు పరిస్థితులలో ప్రజల పై నిత్యావసర వస్తువుల ధరల భారం పడకుండా రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని సూచించారు. ఉపాధి కోల్పోతున్న అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రత్యేక ఉపాధి పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, సూపర్ మార్కెట్లు, బియ్యం వ్యాపారుల విక్రయాలపై నిఘా పెట్టి ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పడకల సంఖ్యను వెయ్యికి పెంచాలని, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

విద్యార్థులకు చెల్లించాల్సిన పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.8,200 కోట్లను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరువు ప్రభావిత ప్రాంతాలలో రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలకు అండగా నిలిచేలా సమగ్ర కార్యాచరణ రూపొందించి తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని పశ్య పద్మ ప్రభుత్వాన్ని కోరారు.

ధర్నాలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular