పి.డి.ఎస్.యూ. జిల్లా అధ్యక్షుడు ఆర్. గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్

బోధన్ టౌన్ నవంబర్ 2 (ద్రోణ):- విద్యార్థి ఉద్యమాల నేత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ 50వ అమరత్వ స్ఫూర్తి ర్యాలీని నవంబర్ 5న విజయవంతం చేయాలని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యూ.) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్. గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు.
బోధన్ పట్టణంలోని పీఆర్టీయూ భవనంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, సమాజంలో మార్పు లక్ష్యంగా కామ్రేడ్ జంపాల చంద్ర శేఖర్ ప్రసాద్ నిరంతరం ఉద్యమించారని తెలిపారు. నాటి పాలకుల విధానాలను ప్రశ్నిస్తూ పోరాడిన ఆయనను ఎన్ కౌంటర్ పేరుతో హత మార్చారని ఆరోపించారు. ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా బలమైన విద్యార్థి ఉద్యమాన్ని పి.డి.ఎస్.యూ. నిర్మించిందని పేర్కొన్నారు.
ప్రశ్నించే గొంతుకలను అణచివేసేందుకు పాలకులు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని విమర్శించారు. విద్యారంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ పెరిగి పోవడంతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో అందక విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థ పై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ 50వ అమరత్వ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ విద్యారంగ సమస్యల పరిష్కారం, విద్యార్థుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్య మించాలని పిలుపునిచ్చారు. నవంబర్ 5న నిర్వహించే ర్యాలీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో పి.డి.ఎస్.యూ. జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్. కార్తీక్, సహాయ కార్యదర్శి ప్రిన్స్, జిల్లా కోశాధికారి సాయినాథ్, బోధన్ డివిజన్ నాయకులు సచిన్, అనిల్, రాజు తదితరులు పాల్గొన్నారు.