ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి పోలీస్ శాఖ ప్రాధాన్యం

ప్రజావాణిలో 37 అర్జీల స్వీకరణ.. అధికారులకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలు

నిజామాబాద్, ప్రతినిధి నవంబర్ 2 ద్రోణ:- ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం 37 ఫిర్యాదులు అందాయి. నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య (ఐ పీ ఎస్) ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకురాగా, వాటిని పరిశీలించి చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం జరగకుండా సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఎస్‌ఐలు, సీఐలతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి కేసుల స్థితి గతులను సమీక్షించారు. బాధితులకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి మధ్యవర్తులు, పైరవీకారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదన్నారు. నేరుగా పోలీస్ శాఖను సంప్రదించి తమ ఫిర్యాదులను అందజేయవచ్చని తెలిపారు. ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, వాటికి చట్టపరమైన పరిష్కారం చూపించేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీపీ వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular