బస్తా బరువు తగ్గినా.. కూలీ రేటు తగ్గొద్దు

50 కేజీల బస్తా అమలుతో హమాలీలకు నష్టం కలిగించొద్దు

ఫిబ్రవరి రేట్ల ఒప్పందాన్ని యథాతథంగా అమలు చేయాలి

రేట్లు తగ్గిస్తే సమ్మెకు సిద్ధం..

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య హెచ్చరిక

నిజామాబాద్, ప్రతినిధి నవంబర్ 06(ద్రోణ):-: వ్యవసాయ మార్కెట్ యార్డులో హమాలీలు, దడువాయిలు, చాట కార్మికులకు ఫిబ్రవరిలో కుదిరిన రేట్ల ఒప్పందాన్ని ఎలాంటి మార్పులు లేకుండా అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్ చేశారు. 50 కేజీల బస్తా తూకం అమలును సాకుగా చూపి కార్మికుల కూలీ రేట్లను తగ్గించేందుకు ప్రయత్నించడం అన్యాయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యవసాయ మార్కెట్ యార్డులో కమిటీ లైసెన్సులు పొందిన హమాలీలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా 50 కేజీల బస్తా తూకాన్ని అమలు చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో అక్టోబర్ 29న జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ సమక్షంలో జరిగిన చర్చల్లో 50 కేజీల బస్తా విధానాన్ని అమలు చేసేందుకు అంగీకారం కుదిరిందని పేర్కొన్నారు.

అయితే మార్కెట్ యార్డు కార్యదర్శి ఈ నిర్ణయాన్ని పక్కదారి పట్టిస్తూ కార్మికులకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఓమయ్య ఆరోపించారు. ఫిబ్రవరిలో అదనపు కలెక్టర్ సమక్షంలో జరిగిన చర్చల్లో 50, 60 కేజీల బస్తాలకు ఒకే రకమైన కూలీ రేటును నిర్ణయించారని గుర్తుచేశారు. కానీ ఆ తర్వాత విడుదల చేసిన సర్క్యులర్‌లో సవరణలు చేస్తూ, 50 కేజీల బస్తా అమలులోకి వస్తే బస్తా కూలీ రేట్లు తగ్గిస్తామని కార్మికులకు చెప్పడం సమంజసం కాదన్నారు.

గతంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్, కమిషనర్ లు సమక్షంలో 40 కేజీల బస్తా విధానానికి అనుగుణంగా ఒప్పందాలు జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుత ఒప్పందాన్ని వక్రీకరించి అధికారులను తప్పు దోవ పట్టించే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకుని ఫిబ్రవరిలో కుదిరిన ఒప్పందాన్ని యథాతథంగా అమలు చేయడంతో పాటు హమాలీ, చాట, దడువాయి కార్మికుల బస్తా కూలీ రేట్లు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే సమ్మెకు దిగేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ అధ్యక్షుడు అంజయ్య, కార్యదర్శి సాయిలు, కోశాధికారి నరేష్‌తో పాటు రాజు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular