25 ఏళ్ల బంధాన్ని వారం రోజుల్లో తెంచేస్తారా?
కార్మికుల గూడు కదిలిస్తే పోరాటం తప్పదు
కార్మికుల నివాసాలపై ఉక్కుపాదం మోపొద్దు

ఐదు వేల కుటుంబాల గూడు కూల్చే ప్రయత్నాలను అడ్డుకుంటాం
సర్ సిల్క్ కార్మికుల ఇళ్ల జోలికొస్తే సహించేది లేదు
25 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారిని వారం రోజులలో ఖాళీ చేయమనడం అన్యాయం
కార్మికులకు అండగా నిలుస్తాం.. అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమం
బంజారాహిల్స్, నవంబర్ 07( ద్రోణ):-: కాగజ్‌నగర్‌లోని సర్ సిల్క్ పరిశ్రమకు చెందిన క్వార్టర్స్‌లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న కార్మికులను ఇళ్ల నుంచి ఖాళీ చేయించాలనే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలంగాణ రక్షణ సేన నాయకురాలు కవిత స్పష్టం చేశారు. సుమారు 25 ఏళ్లుగా అక్కడే జీవిస్తున్న కార్మికులకు కేవలం వారం రోజుల గడువు ఇచ్చి ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయడం దారుణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒకప్పుడు పరిశ్రమలకు కేంద్రంగా వెలుగొందిన కాగజ్‌నగర్ ప్రాంతంలో సిర్పూర్ పేపర్ మిల్లు, సర్ సిల్క్ సంస్థలు వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించాయని గుర్తుచేశారు. అయితే సర్ సిల్క్ పరిశ్రమ మూతపడిన తర్వాత కార్మికులకు చెల్లించాల్సిన అనేక బకాయిలు నేటికీ పరిష్కారం కాలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న సుమారు ఐదు వేల మంది కార్మిక కుటుంబాలను ఇళ్ల నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించడం వారి జీవన భద్రతను ప్రశ్నార్థకం చేయడమేనని పేర్కొన్నారు.

ఏళ్ల తరబడి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా, పరిశ్రమకు చెందిన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించి ఇప్పుడు ఇళ్లు ఖాళీ చేయాలని ఒత్తిడి తీసుకురావడం సరైన విధానం కాదని విమర్శించారు. నోటీసులు అందుకున్న వారిలో స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కూడా ఉన్నారని తెలిపారు.
దీర్ఘకాలంగా నివాసం ఉంటున్న వారికి వర్తించే హక్కులు, నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. పరిశ్రమ స్థలాన్ని కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల నివాసాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.

కార్మికుల పొట్టకొట్టే విధంగా వ్యవహరిస్తే తెలంగాణ రక్షణ సేన చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. స్థానిక నాయకత్వంతో కలిసి కార్మికులకు న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తామని, అవసరమైతే వేలాది మందితో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కవిత స్పష్టం చేశారు.