ఆత్మహత్యకు ప్రేరేపణ, క్రూరత్వం కేసులలో

నిందితుడికి శిక్ష విధించిన నిజామాబాద్ కోర్టు
నిజామాబాద్, నవంబర్ 06 (ద్రోణ):- భార్యను వేధించినట్లు నమోదైన కేసులో నిందితుడికి ప్రధాన జిల్లా మరియు సెషన్స్ న్యాయస్థానం ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో న్యాయమూర్తి జి.వి.ఎన్. భారతి లక్ష్మి బహిరంగ న్యాయస్థానంలో తీర్పు ప్రకటించారు.
వివరాల్లోకి వెళ్తే.. డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో 2024లో క్రైం నంబర్ 265/2024 కింద భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్లు 108, 85 ప్రకారం కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ధర్మారం (బి) గ్రామానికి చెందిన దుబ్బాక బాలస్వామి అలియాస్ స్వామి (33)ని రెండు సెక్షన్ల కింద నేరస్థుడిగా నిర్ధారించింది.
సెక్షన్ 108 కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే సెక్షన్ 85 కింద మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా, చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
ఈ కేసులో ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పి. రాజేశ్వర్ రెడ్డి వాదనలు వినిపించగా, డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ ఆరిఫ్ బ్రీఫింగ్ అధికారిగా, ఎస్ఐ మహమ్మద్ షరీఫ్ దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. కోర్టు సమన్వయ బాధ్యతలను లైజన్ అధికారి ఎస్ఐ టి. గోవింద్ నిర్వహించారు. కేసు విచారణలో సహకరించిన సీడీఓలు, కోర్టు డ్యూటీ అధికారులు, పోలీసు సిబ్బందిని పోలీసు అధికారులు అభినందించారు.