రైతులకు స్పష్టమైన భరోసా ఇవ్వాలి..

బీఆర్ఎస్ నేత ఇల్తెపు గంగారం డిమాండ్
బోధన్, ప్రతినిధి నవంబర్ 06( ద్రోణ):- వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరు తడి పంటల సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అందుకు అవసరమైన నిరంతర విద్యుత్ సరఫరాపై స్పష్టమైన హామీ ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకుడు ఇల్తెపు గంగారం డిమాండ్ చేశారు. సాగు ప్రణాళికలపై సూచనలు చేస్తున్న ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో రైతులకు ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారంపై కూడా దృష్టి సారించాలని అన్నారు.
శుక్రవారం సాలూరు రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్న, సన్నకారు రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని, వారికి ప్రకటించిన బోనస్‌ను అందించాలని కోరారు. రైతులకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే అన్నదాతలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో చందూర్ సాయిరెడ్డి, ముత్యాల దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు.