
వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలి
సాలూర, నవంబర్ 06 (ద్రోణ): వాతావరణ పరిస్థితులలో వస్తున్న మార్పులను ముందుగానే గుర్తించి వ్యవసాయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. సాలూర మండలంలోని రైతు వేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతంలో వచ్చే మార్పులు, వర్షాలు సకాలంలో కురవకపోవడం వల్ల వ్యవసాయ రంగానికి ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు. వాతావరణ పరిస్థితులను బట్టి పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవడం, తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయడం ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు.

వ్యవసాయ రంగంలో అందుబాటులోకి వస్తున్న ఆధునిక పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. శాస్త్రవేత్తల అనుభవాలు, సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ పంటల దిగుబడిని పెంచుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ జిల్లా ప్రాజెక్టు సంచాలకులు తిరుమల ప్రసాద్, సాలూర సర్పంచ్ సోక్కం లావణ్య రవి, అల్లె రమేష్, బోధన్ వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీనివాస్, సాలూర మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారులు, రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఇంధుధర్ రెడ్డి, జగిత్యాల ప్రతినిధులు సౌజన్య, అర్చన తదితరులు పాల్గొన్నారు.