గ్రామాభివృద్ధికి కోరమండల్ చేయూత

హున్సా పాఠశాలలో వాటర్ ప్లాంట్ ప్రారంభం..
గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పనులు
బోధన్, నవంబర్ 06 (ద్రోణ):- గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా సేవా కార్యక్రమాలను చేపడుతోంది. సాలూర మండలం హున్సా గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంస్థ, గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది.

శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మర్కల్ శివకుమార్ రిబ్బన్ కట్ చేసి వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. సంస్థ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి గ్రోమోర్ గ్రామం కార్యక్రమానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చారు.

ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నీటి వనరుల పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ ప్రతి నీటిబొట్టును పొదుపుగా వినియోగించుకోవాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అల్పాహారం అందించారు.


హున్సా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంతో పాటు గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న కోరమండల్ సంస్థ సేవలను సొసైటీ చైర్మన్ మందర్న రవి అభినందించారు. మారుమూల గ్రామమైన హున్సాలో విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంస్థ ముందుకు రావడం హర్షణీయమని, ఈ సహకారం గ్రామ ప్రగతికి దోహదపడుతుందని పేర్కొంటూ సంస్థ ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బోధన్ ఏఎంసీ మాజీ చైర్మన్ శీల శంకర్, జోనల్ మేనేజర్ సజ్జన్ కుమార్, కంపెనీ ప్రతినిధులు, సొసైటీ వైస్ చైర్మన్ వినోద్ బాబా, సీఈవో అనిల్ పటేల్, ఉపసర్పంచ్ నగేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమా, మాజీ ఎంపీటీసీ శివకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
రిపోర్టర్: ఎం. నాగేశ్వరరావు