ఇందిరమ్మ ఇంట్లో తొలి దీపావళి వేడుకలు

ప్రభుత్వ సహకారంతో సొంతింటి కల సాకారం లబ్ధిదారుల హర్షాతిరేకాలు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలి

కలెక్టర్ ఇలా త్రిపాఠి

అర్హులైన వారికి త్వరలో రెండో విడతలో ఇళ్ల మంజూరు

గుడిసెల్లో నివసిస్తున్న వారికి మలిదశ ఇళ్ల మంజూరులో తొలి ప్రాధాన్యత అని వెల్లడి

నిజామాబాద్, నవంబర్ 8 :ద్రోణ

ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్‌ భుజంగరావుతో కలిసి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారు ఎల్‌.లిఖిత ఇంట్లో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. లబ్ధిదారుకు, ఆమె కుటుంబ సభ్యులకు కలెక్టర్‌ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.మామిడి తోరణాలు, అరటి బోదెలు, బంతిపూల మాలలతో అందంగా ముస్తాబు చేసిన ఇందిరమ్మ ఇళ్లు దీపావళి శోభతో దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్మాయి. ఇళ్ల వాకిళ్లలో వేసిన అందమైన ముగ్గులు రంగురంగుల హరివిల్లులను తలపించాయి. కలెక్టర్‌తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు కలిసి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం బాణాసంచా కాలుస్తూ దీపావళి సంబరాలను జరుపుకున్నారు.
ప్రభుత్వ ఆర్థిక సహకారంతో సొంతింటి కలను సాకారం చేసుకున్న తమ ఇంట్లో తొలి దీపావళి పండుగను జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి జరుపుకోవడం పట్ల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కలిగి ఉండటం చిరకాల వాంఛ అని అన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఎవరికి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా పూర్తి పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తున్నామని, నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఇంటి నిర్మాణ ప్రగతిని అనుసరిస్తూ నాలుగు దశలలో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం జమ చేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ సహకారంతో సొంతింటి కలను సాకారం చేసుకుని, దివ్వెల వెలుగులతో లబ్ధిదారులు సొంతింట్లో తొలి దీపావళి పండుగను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కలెక్టర్‌ హర్షం వ్యక్తం చేశారు. మిగతా లబ్ధిదారులు కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని, ప్రభుత్వ యంత్రాంగం తరపున అన్ని విధాలా సహకారం అందిస్తామని భరోసా కల్పించారు.
ఇందిరమ్మ లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా ఇంటి నిర్మాణానికి రుణాలు అందజేయిస్తున్నామని తెలిపారు. ఇళ్లు మంజూరైన వారందరూ సకాలంలో నిర్మాణాలను పూర్తి చేసుకునేలా ఇందిరమ్మ కమిటీలు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. అర్హులైన వారికి మరో వారం, పది రోజుల్లో రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని కలెక్టర్‌ ప్రకటించారు.
గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా మలిదశ ఇళ్ల మంజూరులో గుడిసెల్లో నివసిస్తున్న వారికి తొలి ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా గుడిసెల్లో నివసిస్తున్నట్లయితే, వారి వివరాలను తమ దృష్టికి తీసుకురావాలని ఇందిరమ్మ కమిటీలను కోరారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం త్వరలోనే చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయనుందని కలెక్టర్‌ తెలిపారు. అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకు పెన్షన్లు వర్తించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో అనర్హులకు అవకాశం లేకుండా పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు.
అధికార వికేంద్రీకరణ ద్వారా పల్లెల సత్వర ప్రగతికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కలెక్టర్‌ తెలిపారు. గ్రామ పంచాయతీలకు పన్నుల చెల్లింపులకు సంబంధించిన నిధులను నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.
ప్రస్తుత తీవ్ర వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యాసంగిలో వరి సాగు చేయవద్దని, వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు కలెక్టర్‌ సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు.
కాగా, కుర్నాపల్లి గ్రామంలోని మరో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు జి.ప్రియాంక ఇంటి వద్ద అదనపు కలెక్టర్‌ భుజంగరావు ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ ఇన్‌చార్జి ప్రాజెక్టు డైరెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారిణి గీత, మండల ప్రత్యేక అధికారి (డీఆర్డీఓ) సాయన్న, బోధన్ ఆర్డీఓ విజయకుమారి, స్థానిక సర్పంచ్‌ సాయిలు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాజాగౌడ్‌, హౌసింగ్‌ డీఈ గంగాధర్‌, ఎంపీడీఓ శంకర్‌నాయక్‌, తహసీల్దార్‌ దత్తాద్రి, స్థానిక నాయకులు పులి శ్రీనివాస్‌, బి.రాంమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular