పండుగ వేళా.. ప్రజల భద్రతే ధ్యేయం!

అక్రమ పేకాట స్థావరాల పై బోధన్ రూరల్ పోలీసుల ఉక్కుపాదం.. మూడు రోజులలో 47 మంది అరెస్ట్

8 కేసులు నమోదు.. రూ.99,610 నగదు స్వాధీనం

పండుగ సంబరాల మధ్య విధి నిర్వహణలో నిమగ్నమైన పోలీసులు.. ఎస్సై ఎం. రాజశేఖర్ పర్యవేక్షణ పై ప్రశంసలు

బోధన్, నవంబర్ 9 (ద్రోణ):-

పండుగలు ప్రజల జీవితాలలో ఆనందాన్ని నింపే వేళ.. ఆ ఆనందానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రజల రక్షణే లక్ష్యంగా పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులతో ప్రజలు పండుగ సంబరాలలో మునిగి తేలుతున్న సమయంలోనూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత నిస్తూ బోధన్ రూరల్ పోలీసులు చేపడుతున్న చర్యలు అభినందనీయం. ముఖ్యంగా పేకాట, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డు కట్ట వేస్తూ ప్రజలకు భద్రతా భరోసా కల్పించడంలో పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.

బోధన్ రూరల్ ఎస్సై ఎం. రాజశేఖర్ పర్యవేక్షణలో నవంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగం, మంధర్నా, పెగడపల్లి, సాలూర, ఆమ్దాపూర్ గ్రామాలలో అక్రమ పేకాట స్థావరాల పై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కల పేకాట (టీన్ పట్టీ) ఆడుతున్న వారి పై మొత్తం 8 కేసులు నమోదు చేసి 47 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.99,610 నగదును స్వాధీనం చేసుకున్నారు.

పండుగ వేళా.. విధి నిర్వహణలో రాజీ లేని పోలీసులు

పండుగల సమయంలో సాధారణంగా పోలీసుల పై భద్రతా పరమైన బాధ్యతలు మరింత పెరుగుతాయి. ప్రజలు ప్రశాంతంగా పండుగ జరుపుకు నేలా చూడటంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసు కోకుండా నిరంతర నిఘా కొనసాగించాల్సి ఉంటుంది. ఇలాంటి కీలక సమయంలోనూ బోధన్ రూరల్ పోలీసులు అక్రమ పేకాట స్థావరాల పై వరుస దాడులు నిర్వహించడం వారి అంకిత భావానికి, బాధ్యతాయుతమైన విధి నిర్వహణకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఎస్సై ఎం. రాజశేఖర్ ప్రత్యేక పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది సమన్వయంతో సమాచారాన్ని సేకరించి, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతూ అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు కృషి చేస్తున్నారు. కేవలం నేరాలు జరిగిన తర్వాత స్పందించడమే కాకుండా, ముందస్తు నిఘాతో వాటిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు పోలీసుల కార్యదక్షతను చాటుతున్నాయి.

కుటుంబాల ఆర్థిక భద్రతకు పేకాటపై ఉక్కుపాదం

పేకాట, బెట్టింగ్ వంటి వ్యసనాలు వ్యక్తుల జీవితాలను దెబ్బతీయడమే కాకుండా కుటుంబాల ఆర్థిక పరిస్థితిని కూడా చిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా యువత ఇలాంటి వ్యసనాలకు ఆకర్షితులు కాకుండా పోలీసులు అవగాహన కల్పించడంతో పాటు, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రశంసనీయం.

ప్రజల సహకారంతో మరింత మెరుగైన శాంతి భద్రతలు

అక్రమ పేకాట, బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తప్ప పని ఎస్సై ఎం. రాజశేఖర్ హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తమ ప్రాంతాలలో ఎక్కడైనా అక్రమ పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ప్రజలు పండుగలను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకునేలా నిరంతరం శ్రమిస్తున్న బోధన్ రూరల్ పోలీసుల సేవలు అభినందనీయమని పలువురు అభిప్రాయ పడుతున్నారు. పండుగ వేళ సైతం వ్యక్తిగత సౌకర్యాల కంటే ప్రజా భద్రతకే ప్రాధాన్యత నిస్తూ విధులు నిర్వహిస్తున్న ఎస్సై ఎం. రాజశేఖర్‌తో పాటు పోలీసు సిబ్బంది కృషి అభినందించదగినది.

ప్రజలు పండుగ వెలుగులలో ఆనందంగా గడుపుతుంటే.. వారి భద్రత కోసం అప్రమత్తంగా గస్తీ కాసే పోలీసులు నిజమైన సేవాభావానికి ప్రతి రూపాలు. ప్రజల ప్రశాంతతే లక్ష్యంగా బోధన్ రూరల్ పోలీసులు కొనసాగిస్తున్న ఈ కృషికి ప్రజల సహకారం, అభినందనలు మరింత బలాన్నివ్వాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular